లోకంలోని
డొంకతిరుగుళ్లు చెడ్డ చికాకులు తెప్పిస్తాయి అత్యుష్ణకి. ఇది నేరుగా ఉండదేం
అనుకుంటాడు. చిన్నప్పుడు అతనికి పెద్ద వాళ్ళ మాటలు అర్థమయ్యేవి కాదు. పాయింట్ లెస్
అనుకునేవాడు. పాయింట్ ఉండే ఉండొచ్చు. తనకు అర్థం కానప్పుడు.. అది ఎంత పెద్ద
పాయింట్ అయినా..' నో పాయింట్ ఇన్ ఇట్' అత్యుష్ణకి. అత్యుష్ణ ఇప్పుడు పెద్దయ్యాడు
కానీ, పెద్దగా ఏం కాలేదు.! ఓ పాతిక ఉంటాయంతే. పాతిక అంటే ఓ మోస్తరు పెద్దే. అయినా
తను ఆ పాతికంటే ముందే పెద్ద వాడయ్యాడని అత్యుష్ణ నమ్మకం. అతడికి ఆ నమ్మకాన్ని
ఇచ్చింది కూడా ఈ లోకమే. లోకం మాట్లాడుకునే కొన్ని విషయాల మీద అత్యుష్ణ కు అమితమైన
ఆసక్తి కలిగేది. వాటి గురించి ఇంకా క్లియర్ గా చెప్పమని లోకాన్ని అడిగేవాడు. లోకం
ఏదో చెప్పేది. 'ఏదో చెప్పడం కాదు, ఉన్నదేదో కరెక్ట్ గా' చెప్పమనేవాడు. లోకం కళ్ళు తేలేసేది. అప్పుడే అతడికి అనిపించింది..
లోకం
పెద్దది కానీ, తనకంటే పెద్దదేం కాదని! సంతృప్తికరమైన సమాధానం చెప్పలేని వారు..
గురుబ్రహ్మ అయితేనేం, గురు విష్ణు అయితేనేం, గురుదేవో.. మహేశ్వర అయితేనేం?
ముఖ్యంగా మూడు విషయాలు అత్యుష్ణకు ఈ లోకాన్ని చులకనచేసి పడేసాయి. దేవుడు, దెయ్యం, ప్రేమ!
దేవుడు.. దేవుడు అనడమే కానీ దేవుణ్ణెక్కడా అత్యుష్ణ కు చూపించింది లేదు. 'దేవుణ్ణి
ఎవరో వచ్చి చూపించడం ఉండదురా మూర్ఖుడా! ఎవరికి వారే చూసుకోవడం మాత్రమే ఉంటుంది.'
అని పూజారి అన్నప్పుడు.. వినడానికి బాగుంది కానీ నమ్మడానికి బాగోలేదు అత్యుష్ణ కు.
అయితే పూజారి మీద అతడికి నమ్మకం కలిగింది. తనను మూర్ఖుడా అని అంత గట్టిగా
అన్నాడంటే.. అతడి దగ్గర తన మూర్ఖత్వానికి తగిన విరుగుడు జ్ఞానం ఏదో కచ్చితంగా ఉండి
ఉంటుంది.! ఆయన కొంచెం తవ్వితే అది తనకు దొరకవచ్చు. " ఎవరికి వారు దేవుని
చూసుకోవడం వరకు అర్థమైంది స్వామి. సృష్టిలో ఏదైనా ఉంది అంటే అది అందరికీ ఒకేలా
కనిపిస్తుందై ఉండాలి కదా అని నా సందేహం" అన్నాడు. పూజారి నవ్వుతూ చూసాడు.
" మనుషులంతా ఒకేలా ఉన్నారా అబ్బాయ్.. మనుషులందరికీ దేవుడు ఒకేలా
కనిపించడానికి?" అన్నాడు. పూజారి మళ్లీ ఇంకోసారి మూర్ఖుడా అనకుండా అబ్బాయి
అనడం గమనించాడు అత్యుష్ణ.
తన పాయింట్ లో పూజారికి పాయింట్ కనిపించిందన్నమాట!
ఎప్పుడు దేవుడి దగ్గర ఉండే పూజారే.. ఎవరి దేవుడిని వారే వెతుక్కోవాలి అని
చెప్పినప్పుడు అత్యుష్ణ కు ఒకటి స్పష్టం అయింది. దేవుడి దగ్గర పూజారి ఉన్నాడు
కానీ, పూజారి దగ్గర దేవుడు లేడు! దెయ్యాన్ని కూడా ఈ లోకం అత్యుష్ణ కు
చూపించలేకపోయింది. " మేము చూశాం" అని చెప్పినవాళ్ళను పట్టుకుని
అడిగాను.." నిజంగా మీరు చూశారా?" అని. " నిజంగానే మేము చూశాం"
అన్నారు. " దెయ్యం ఎలా ఉంది?" అని అడిగాడు. చనిపోయిన.. వాళ్ల పిన్నమ్మ
లా ఉందనో, సూసైడ్ చేసుకున్న ఫలానా వెంకటలక్ష్మి లా ఉందని చెప్పారు తప్ప.. దెయ్యం
అంటే ఇలా ఉంటుందన్న ఒక పిక్చర్ అయితే రాలేదు అత్యుష్ణ కు. 'దేవుని ఎవరో వచ్చి
చూపించడం ఉండదురా మూర్ఖుడా! ఎవరికి వారే చూసుకోవడం మాత్రమే ఉంటుంది' అన్న పూజారి
సూత్రాన్ని దెయ్యాలకుా అన్వయించుకుని చూస్తే మాత్రం.. దెయ్యాలు ఉన్నాయనే
అనుకోవాలి. అంటే దేవుడు కానీ, దెయ్యం కానీ.. మనిషి అనుకుంటే ఉండడం తప్ప, మనిషి
అనుకోకుండా ఉండడం అనేది ఉండదు అని సరిపెట్టుకున్నాడు అత్యుష్ణ. అయితే దేవుడిని,
దెయ్యాన్ని వదిలించుకున్న అంత తేలిగ్గా ప్రేమను వదిలించుకోలేకపోతున్నాడు అత్యుష్ణ.
ఆ ప్రేమ పేరు విరాళి. మెస్సులో అత్యుష్ణ కు భోజనం వడ్డించే అమ్మాయి విరాళి.
అందరికీ తనే వడ్డిస్తుంది. అత్యుష్ణ కు వడ్డించడానికి మాత్రం ఆమె ఎదురుచూస్తూ
ఉంటుంది! ఎప్పుడుా.. మెస్ టైమింగ్స్ అయిపోతున్నప్పుడు మాత్రమే వస్తాడు అత్యుష్ణ.
మొదట్లో ఉన్నదేదో వడ్డించాలి విరాళి. తర్వాత కొన్నాళ్లకు వడ్డించడం కోసం ఉంచి
పెట్టేది! ఒకవేళ ఆ రోజుకి అత్యుష్ణ రాకపోతే.. అదలా ఉండిపోతుందఅంతే. ఆ విషయం
అత్యుష్ణ కు చెప్పేదికాదు. చెప్పినా,
'మీకోసం ఎదురు చూశాను' అని చెప్పేదే తప్ప, 'మీకోసం తీసి పెట్టాను' అని
మాత్రం చెప్పేదికాదు.విరాళి వడ్డించే అమ్మాయే కానీ, వడ్డించే పనిలోకి వచ్చిన
అమ్మాయి కాదు. మెస్ వాళ్ళ అమ్మాయి. అందుకే అత్యుష్ణ కు ఏ టైంలో వెళ్లిన తినడానికి
ఇంత దొరికేది.
ఎప్పటిలా ఆరోజు కూడా తినడానికి ఇంత దొరికింది అత్యుష్ణ కు. నిజానికి
ఆరోజు అతడికి ఇంకాస్త ఎక్కువ దొరికింది! " ఇలాగైతే ఆరోగ్యం పాడైపోతుంది"
అంది విరాళి మెల్లగా. ఫస్ట్ టైం అత్యుష్ణ తో ఆమె అలా అనడం. ఆమెవైపు చూశాడు
అత్యుష్ణ. కొత్తగా ఉంది. తల స్నానం చేసిందేమో అనుకున్నాడు. వాళ్ళిద్దరే ఉన్నారు
అక్కడ. " ఇలాగైతే మీ ఆరోగ్యం పాడైపోతుంది" మళ్లీ అంది విరాళి.. ఈసారి
కొంచెం వినిపించేలా.' మీ ఆరోగ్యం కూడా' అందామనుకున్నాను. అనలేదు. చిన్న మాటని
పట్టుకుని ఆడపిల్లలు ఊరికే అల్లేసుకుంటారని అతడి భయం. దేవుడు, దెయ్యం లాగే.. ప్రేమ
కూడా ఒక 'అస్పష్టత' అతడికి. మనిషి దేవుడిని నమ్మినట్లే, దెయ్యాలని
నమ్మినట్లే..విరాళి గాని, ఇంకొక అమ్మాయి కానీ ప్రేమ అనేది ఈ లోకంలో ఒకటుందని
నమ్మడానికి తను కారణం కాకూడదనుకున్నాడు. అత్యుష్ణ రూమ్ కి చేరుకునేటప్పటికి రాత్రి
పన్నేండైంది." దేవత వచ్చేళ్ళింది. అదిగో నీకోసమే ఆ టిఫిన్ బాక్స్"
అన్నాడు రూమ్మేట్. 'దేవత' అతడు అంటున్నది.. రూమ్ కింద పోర్షన్ లో ఉండే ఓనర్ వాళ్ళ
అమ్మాయిని. " దేవతేంటి కొత్తగా?!" అన్నాడు అత్యుష్ణ. ఆమెకు అత్యుష్ణ
పెట్టిన పేరు దెయ్యం అని. పట్టుకుంటే వదలదని. " తిండికి వేల లేనివాళ్లు
దెయ్యాలైతే.. ఏ వేళ కొచ్చిన వడ్డించే వాళ్ళు దేవతలే గా" అన్నడు రూమ్మేట్.
బాక్స్ ని ఓపెన్ చేయలేదు అత్యుష్ణ. పడుకుని నిద్రలోకిజారుకుంటుా ఉండగా.. అతడికో
క్లారిటీ వచ్చింది. ఒకే మనిషిలో ఒకరికి దేవత, ఒకరికి దెయ్యం కనిపిస్తుంటే..
దెయ్యాలు, దేవుళ్ళు ఉండడమన్నది ఒక పాయింటే కాదని! జీవితాన్ని ప్రేమ తాకందే పాయింట్
అర్థం కాదని!!
"ఉన్నాయి...
Reviewed by Smartbyte group
on
August 22, 2018
Rating:

No comments: