నూటా నలభై ముాడోసారి


"                   బ్రేకప్ కి ముందు నిన్ను ఒక మనిషిగా నేను ప్రేమించాను. బ్రేకప్ అయ్యాక నేనొక మనిషినై నిన్ను ప్రేమిస్తున్నాను." " గాడ్.. అవుతావా! వద్దనుకున్నాం కదా విహాన్.. నాకు నువ్వు. నీకు నేను. నీ మాటలు నాకు అర్థం కాదు. మాటలే అర్థం కానప్పుడు మనిషితో రేలేషన్ నిలుస్తుందా చెప్పు".. తలపట్టుకుంది. మణిిచందన. " నాకు ఇష్టం లేదు చందన నువ్వంటే. కానీ నిన్ను ప్రేమిస్తున్నా. ఇష్టాన్ని, ప్రేమను వేరు చేసి చూడలేవా నువ్వు?" " చంపుతున్నావ్ విహన్. ఇష్టాన్ని, ప్రేమను వేర్వేరుగా ఎలా చూస్తారు చెప్పు?" " అలానా?! నేనంటే నీకు ఇష్టం లేదు. నువ్వంటే నాకు ఇష్టం లేదు. మన ఇష్టాన్ని పక్కన పడేద్దాం. ప్రేమకు ఇష్టాలు ఉండవా? వాటిని మనం గౌరవించాలేమా చందన?" " ప్రేమకు ఇష్టాలేంటి విహాన్? మనుషులకు కదా ఉండేది ఇష్టాలైనా, ప్రేమలైనా?" " పొరపాటు చందనా. ప్రేమ నన్ను ఎంపిక చేసుకుంది నిన్ను ఇష్టపడని. అదే ప్రేమ నిన్ను ఎంపిక చేసుకుంది.. నాపై నీ ఇష్టాన్ని తేంపేసుకోమని" " అంటే.. విహన్?!" " మన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా.. మనల్ని కలుపుకోవడానికో, విడదీయడానికో ప్రేమ మనిద్దరిని ఒక సెట్ గా చేసుకుంది చందనా" అన్నాడు విహాన్. 

                                 చందన భయపడింది. " విహన్.. మనం ఎందుకు విడిపోయామో తెలుసా? ఇదిగో ఈ క్యాచ్ ట్వంటీటుా లాంగ్వేజ్ నాకు అర్ధం కాకనే! నాకు అర్థమయ్యే భాషలో మాట్లాడలేవా విహన్. ఇప్పుడైనా, విడిపోయాకైనా.." వేడుకొంటుంది చందన. " ఓకే చందనా. నువ్వు నన్ను ప్రేమించోద్దు. కానీ నేను ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నానని నువ్వు తెలుసుకుంటే చాలు నాకు" " అప్పుడేమవుతుంది విహన్?" " ఏం కాదు. ఏం కాకపోవడమే కదా మీ అమ్మాయిలకు కావాల్సింది. ఏం కాదు కాబట్టే కాఫీ తాగడానికి వస్తారు. ఏం కాదు కాబట్టే మాటలు వరకు వస్తారు. ఏం కానంతవరకుా.. ఎంత దూరమైనా వస్తారు" " ఇప్పుడు నీకేం కావాలి విహన్?" " నాకేం కావాలి అని అడక్కు చందనా. నా ప్రేమకు ఏం కావాలి అని అడుగు." " సరే.. నీ ప్రేమ కు ఏం కావాలట?" " నీ చెంప పగల గొట్టాలట?" అన్నాడు విహాన్. " నిజంగా ప్రేమ ఉన్న వాళ్ళు అడిగి ఏది చెయ్యరు విహన్. నా బర్త్ డే కి గిఫ్ట్ ఇచ్చావు. అడిగి ఇచ్చావా?" పెద్దగా నవ్వాడు విహన్. చందన కూడా నవ్వింది. విహన్ చందనను దగ్గరకు తీసుకునేలోపే, చందన విహాన్ గుండెల్లోకి వెళ్ళిపోయింది. 

                      నూటా నలభై ముాడోసారి వాళ్ళలా కలుసుకోవడం. " ఏంటి చందన నాతో మాట్లాడవు?! మొహం మొత్తేశానా? ఇంకెవరినైనా లవ్ చేస్తున్నావా? చెప్పు మీ ఇద్దరికీ పెళ్లి చేసేసి, నేను తప్పకుంటా. ఫోన్లో నీ నెంబర్ కూడా ఉంచుకొను. డిలీట్ చేసేస్తా". " పెళ్లి మేమిద్దరం చేసుకుంటాం కానీ, నువ్వు నా నెంబర్ డిలీట్ చేసుకో.. చాలు." " ఎవరు వాడు?" " నువ్వే చెప్పాలి ఎవడో వాడు. అన్నావు కదా.. ఇంకెవరినో లవ్ చేస్తున్నానని!"  " సారీ.. ఏమైంది చెప్పు" " అయిందని నేను చెప్పానా?" " మాట్లాడడానికి ఏమయింది అంటున్న చందనా.. నీకేదో అయిందని కాదు?" " నాకు స్పేస్ కావాలి విహాన్. కొన్నాళ్లు నీ నుంచి స్పేస్ కావాలి" " వాట్" అన్నాడు విహాన్. " ఎస్" అంది చందన. " నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నా నుంచి స్పేస్ కోరుకుంటావా చందనా. నీ జీవితానికి నేను అంత ఇరుకై పోయానా?" " నిజంగా నన్ను ప్రేమించాను కనకే.. నువ్వు నాకు ఇరుకైపోయావని నీతో మాత్రమే చెప్పగలుగుతున్నాను విహన్" " నువ్విప్పుడు మాట్లాడేది క్యాచ్ ట్వంటీటుా లాంగ్వేజ్ కదా చందనా?" " ఏ లాంగ్వేజో నాకు తెలియదు. అర్థమయ్యేలా చెప్పగలిగానని మాత్రం అనుకుంటున్నా. నీ ప్రేమ బరువును నేను చేయలేకపోతున్నాను విహన్" " చావు" అన్నాడు విహన్. మూడు వందల నలభైఒకటోవ సారీ వాడిలా విడిపోవడం. " అబ్బా.. చంపుతున్న విహాన్. ఇష్టాన్ని, ప్రేమను వేర్వేరుగా చూసి ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు. చచ్చిపోనా? ఎప్పుడు అంటూంటావుగా చావమని" అంది చందన
" చచ్చిపోవద్దు"
"మరీ!"
" బతికించు"
" ఎవర్ని?!"
"నన్నే"
" బాగానే ఉన్నావుగా, నన్ను చంపకు తినడానికి. ఇంకా ఏం బతికించాలి నిన్ను". " మనిషిగా నన్ను బతికించు చందనా. ప్లీజ్. ఏడుస్తోంది చందన. విహన్ సమాధి పక్కనే కూర్చుని. " వెళ్దాం పద.. చీకటి పడుతుంది" అంది యోగిత. ఇద్దరు నడుస్తున్నారు.  " మనిషిగా బతికించమని అంటే ఏంటి చందనా?! విహన్ ఎందుకలా అన్నాడు." " తెలీదు యోగిత. కానీ మనిషిగా ఉన్నప్పుడు మాత్రం విహన్ అలా అనలేదు." ఉలిక్కిపడింది యోగిత. " అంటే..?! " ఆ రోజు ఇద్దరం బాగా గొడవపడ్డాం. ఎప్పుడు నన్ను చావు.. చావు.. అనేవాడు. ఈరోజు మాత్రం నేను అన్నాను విహన్ ని చావమని" కన్నీళ్లు ఆగట్లేదు చందనకి. " ఊరుకు చందన... ప్లీజ్" అంటుంది యోగిత. " చావమనగానే చావడానికి వెళ్ళిపోయాడు స్టుపిడ్. చచ్చిపోయాక వచ్చి బ్రతికించమంటున్నాడు. ఇప్పుడు కూడా వాడు ఇక్కడ ఎక్కడో నా పక్కనే ఉండి ఉంటాడు. బ్రతికించు చందనా.. బ్రతికించు చందనా.. అని బెగ్ చేస్తూ ఉండి ఉంటాడు".. ఏడుస్తుంది చందన. " ఆత్మలు నిజంగానే ఉంటాయంటావా చందనా?" అడిగింది యోగిత, చందన చేతిని గట్టిగా పట్టుకుంటుా. చందన వెనక్కితిరిగి విహాన్ సమాధి వైపు చూస్తుంది. " తెలీదు యోగితా. కానీ ప్రేమ ఉంటుంది" అంది.

నూటా నలభై ముాడోసారి నూటా నలభై ముాడోసారి Reviewed by Smartbyte group on August 29, 2018 Rating: 5

No comments: