ప్రారంభం


                  ' ప్రేతాత్మ' పత్రికా కార్యాలయం! ఎడిటర్ ఎదురుగా కూర్చుని ఉన్నాడు క్షుద్రేంద్ర. ప్రముఖ క్షుద్ర రచయిత అతడు. అతడి ఎలా ఉంటాడో ఒక్కసారైనా చూడాలని పాఠకులే కాదు, పత్రికా సిబ్బంది కూడా కుతూహల పడుతున్నారు. అయితే ఆ అదృష్టం ఒక్క 'ప్రేతాత్మ' ఎడిటర్ కి మాత్రమే దక్కింది! పదిహేనేళ్లుగా ఆ పత్రిక వస్తుంది. ప్రారంభంనుంచి అందులో వారం వారం  క్షుద్రేంద్ర కథ వస్తుంది. అది దెయ్యం కథ. బాగా పాపులర్. అసలు ప్రారంభ సంచిక మార్కెట్లోకి వచ్చినప్పుడే..' రచయితను ఒక సారి చూడాలని ఉంది' అనే పత్రికా కార్యాలయానికి పుర్రెల కొద్ది ఉత్తరాలు, ఎముకల కొద్ది ఈమెయిల్ లు వచ్చాయి. ఆ తొక్కిడిని తట్టుకోలేక నాలుగో వారంలోనే చిన్న నోట్ పెట్టాడు ఎడిటర్.. 'చితి కాలుతున్నప్పుడు కపాలమోక్షం జరిగినట్లుగా, కథ చదువుతున్నప్పుడే రచయిత మీకు పైకి లేస్తూ కనిపిస్తాడు చూడండి' అని! 'ప్రేతాత్మ' ఎడిటర్ పాఠకులకు పెట్టే గమనికలన్ని ఇలాగే గమ్మత్తుగా ఉంటాయి. 

                                   డిటర్ తనదైన శైలిలో ఎన్ని గమనికలు పెట్టినా, పాఠకలోకం మాత్రం  క్షుద్రేంద్రను చూపించమని ఏళ్లుగా అడుగుతూనే ఉంది. " అలా చూపించలేము కానీ, కావాలంటే రచయితతో 'ప్రశ్నలు- జవాబులు' శీర్షికను పెట్టించగలను అని పాఠకులకు మరో గమనిక రాశాడు ఎడిటర్. ఆ శీర్షికకు ఆయన పెట్టిన పేరు 'దెయ్యం తో క్యాండిల్ లైట్ డిన్నర్'. దానిక్కూడా పుర్రెలకొద్ది ఉత్తరాలు, ఎముకల కొద్ది ఈమెయిల్ లు! పాఠకుల ప్రశ్నలకు క్షుద్రేంద్ర ఇచ్చే సమాధానాలు ఆయన కథల్ని మించి పాపులర్ అయ్యాయి! 'ఈ కథలు, కుకుంబర్లు కాదుగాని, నాకు నిజంగా బియ్యాన్ని చూడాలనిఉంది. చూపించగలరా?' అని వర్థని అనే ధైర్యస్థురాలు వెంకటాపురం ఎస్టేట్ నుంచి ఉత్తరం రాసింది. 'దెయ్యాన్ని చూసి ధైర్యం మనకు మాత్రమే ఉంటే సరిపోదు. మనల్ని చూసి ధైర్యం దెయ్యానికి కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం దెయ్యాన్ని చూడగలం' అని క్షుద్రేంద్ర జవాబు రాశాడు. 'దెయ్యాల కథల్ని రాసి సమాజానికి మీరేం సందేశం ఇవ్వదలుచుకున్నారు.?'.. ఇంకో ప్రశ్న. 'దెయ్యాల కథలతోపాటు మనుషులు కథలు పత్రికల్లో వస్తున్నాయి కదా. మనుషుల కథల్ని రాసి సమాజానికి మీరేం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అని దెయ్యాలు ఏనాడైనా మనల్ని అడిగాయా?!'.. క్షుద్రేంద్ర జవాబు. ఇలా సాగేది..' దెయ్యంతో క్యాండిల్ లైట్ డిన్నర్'. " ఈ వారం నుంచి మీ రెమ్యూనరేషన్ ని పెంచుతున్నాం క్షుద్రేంద్ర గారుా.." అన్నాడు ఎడిటర్.  క్షుద్రేంద్ర నవ్వాడు. 

                              వారానికి ఇవ్వవలసిన కథ అతడి చేతిలో ఉంది. దాన్ని ఎడిటింగ్ టేబుల్ మీద పెట్టింది. క్షుద్రేంద్ర కథను పోస్ట్ చెయ్యడు. మెయిల్ చెయ్యడు. నేరుగా వచ్చి, ఎడిటర్ ని కలిసి, ఎడిటర్ కే ఆ కథ కాగితాలు ఇచ్చి వెళ్తాడు. అవి కంపోజ్ అయి ఉండవు. చేతిరాతతో ఉంటాయి. అవి జిరాక్స్ లు కూడా కాదు. ఒరిజినల్. ఇలా రాసి, అలా తెచ్చిస్తాడు. అదికూడా డెడ్ లైన్ మించకపోకుండా! కథ ఎంత గొప్పగా ఉన్నా, కథని టైంకి తెచ్చివడమే గొప్పగా అనిపిస్తుంది ఎడిటర్ కి ప్రతిసారి. ఈ పదిహేనేళ్లలో ఈ ఒక్క వారం కూడా.. 'కథ అయ్యిందా?' అని క్షుద్రేంద్రకు ఎడిటర్ నుంచి ఫోన్ వెళ్ళలేదు.  క్షుద్రేంద్ర తెచ్చిన కథను ఇష్టంగా చేతుల్లోకి తీసుకున్నాడు ఎడిటర్. " మీ కథ మా పత్రిక్కి ఎంతో ఇచ్చింది క్షుద్రేంద్ర గారుా. మా పత్రికే మీకు తగినంతగా ఇవ్వలేకపోయింది. రెమ్యూనరేషన్ పెంచడంతోపాటు, మీకు ఒక గౌరవ సన్మానం కూడా ఏర్పాటు చేయాలనుకున్నాం" అన్నాడు. ఆ మాట నిజం. క్షుద్రేంద్ర తనకు తెలియకుండానే పత్రిక్కి చాలా ఇచ్చాడు. వారం వారం 'ప్రేతాత్మ' మార్కెట్ లోకి రాగానే, పాఠకులు ముందుగా వెదికేది  క్షుద్రేంద్ర రాసి దెయ్యం కథ కోసమే. ఆ కథను చదివితే దెయ్యాలంటే భయపడే వాళ్లకు దెయ్యాల భుజమ్మీద చెయ్యివేసి నడవాలనిపిస్తుంది. 

                          దెయ్యాలను నమ్మిన వాళ్లకు నిజంగానే దెయ్యాలు ఉండి ఉంటే ఈ లోకం ఎంత అందంగా ఉంటుందో కదా అనిపిస్తుంది. క్షుద్రేంద్ర నవ్వాడు. " పాఠకుల మనసులో సుస్థిరస్థానం సంపాదించుకోవడం కన్నా స్మశానం ఏముంటుంది చెప్పండి ఒక రచయితకి" అన్నాడు. " కావచ్చనుకొండి. మిమ్మల్ని సన్మానించుకోవడం పత్రిక్కి గౌరవం" అన్నాడు ఎడిటర్. " నేను మీలో ఒకడిని అనుకోండి. ఎవరిని వారే గౌరవించుకోవడం బాగోదు కదా".. నవ్వాడు క్షుద్రేంద్ర. " ఆ మాట నిజం. మీరు మాలో ఒకరే" అన్నాడు ఎడిటర్. నమస్తే పెట్టి, పైకి లేచాడు క్షుద్రేంద్ర.  క్షుద్రేంద్ర అలా వెళ్లగానే, ఇలా ఎడిటర్ క్యాబిన్ లోకి వచ్చాడు కథల విభాగం హెడ్. " రండి.. శర్మా.. కూర్చోండి" అన్నాడు ఎడిటర్. " ఈవారం ఏం చేద్దాం సార్" అన్నాడు శర్మ. " ఏంటి.. చేయడం?" " అదే సర్, క్షుద్రేంద్ర గారి కథ.." అంటూ ఆగాడు. " ఓ! అదా.. వస్తుందిలే" అన్నాడు ఎడిటర్ నవ్వుతూ.. క్షుద్రేంద్ర తనకు కథ ఇచ్చిన విషయాన్ని చెప్పకుండా. " అది కాదు సార్. క్షుద్రేంద్రగారు పోయారట" అన్నాడు శర్మ. " వాట్!!" అదిరిపడ్డాడు ఎడిటర్. " అవును సార్. ఈ తెల్లవారుజామునట. హార్ట్ ఎటాక్. మీకు తెలుసనుకున్నాను" అన్నాడు శర్మ. తె..ల్ల..వా..రు..జా..ము..నా..?!! సగం తెరిచి ఉన్న సోరుగు వైపు చూశాడు. అంతక్రితమే క్షుద్రేంద్ర ఇచ్చి పెళ్ళి నా కథ కాగితాలు కనిపిస్తున్నాయక్కడ. ఆ వారం 'ప్రేతాత్మ' సంచిక మార్కెట్లోకి వచ్చింది కానీ, అందులో  క్షుద్రేంద్ర కథ లేదు. ఎప్పుడు ఆయన కథ ఉండే పేజీ మొత్తం తెల్లగా ఉంది! ఆ తెల్లటి పేజీ మధ్యలో చిన్న అక్షరాల్లో రెండే రెండు వాక్యాలు. 'పదిహేనేళ్ల నాటి క్షుద్రేంద్ర కథలు మళ్లీ ప్రారంభం. వచ్చేవారం నుంచే' ఆ అక్షరాలకు ఎడిటర్ వేళ్లు ఆత్మీయంగా నిమిరాయి. సోరుగులోని ఆ 'చివరి కథ'ను మాత్రం తెరిచి చూడలేదు ఎడిటర్. తన పత్రికలో ఎప్పటికీ క్షుద్రేంద్ర మాత్రమే ఉండాలి. క్షుద్రేంద్ర కథ ఉండకూడదు అనుకున్నాడు ఆయన.

ప్రారంభం ప్రారంభం Reviewed by Smartbyte group on August 29, 2018 Rating: 5

No comments: