ఇరవై
ఏళ్ల వయసులో ఊరి నుంచి వెళ్లిపోయిన వాడు, ఇరవై ఏళ్ల తర్వాత ఊళ్లోకి దిగాడు
బెనర్జీ. ఊళ్లో బస్సు దిగేటప్పటికి రాత్రి ఒంటిగంట అవుతుంది. అతడిని దించేసి బస్సు
ముందుకు వెళ్లిపోయింది. రోడ్డుమీద ఒక్కడే మిగిలాడు. బస్సులోంచి బెనర్జీ తనొక్కడే
దిగాడు. లగేజీ లాంటిదేమీ అతనితోపాటు దిగలేదు. ఒంటిమీద ఖరీదైన బ్లూ జీన్స్, టచ్
చేసిన లేత నీలం రంగు ప్లేయిన్ షర్ట్. ఎన్ని గంటలు ప్రయాణం లో అవి రెండూ కాస్త
అలసిపోయినట్లు అయ్యాయి కానీ, బెనర్జీ మాత్రం బస్సు కుదుపుల్లో ఎక్కడ నలిగినట్లు
లేడు. బస్సులోంచి దిగగానే కాసేపటి వరకు అలా నిలబడిపోయాడు బెనర్జీ. వేసవికి
ఉక్కపోతగా ఉంది.ఇరవై ఏళ్ల తర్వాత ఉక్కపోస్తున్నట్లుగా ఉంది అతనికి. అప్పుడు కాని
అతనికి ఊళ్లోకి వచ్చిన అనుభూతి కలగలేదు. చిన్నప్పటి చర్చి లాగానే ఉంది. చిన్నప్పటి
చెట్లు అలాగే ఉన్నాయి. చిన్నప్పటి అంటే.. ఇరవై ఏళ్ల క్రితానివని కాదు. అంతకన్నా
ముందువి. బెనర్జీకి ఊహ వచ్చిననాటి నుంచి అక్కడ చూస్తున్నవి. ఇన్నేళ్ల తర్వాత అతడు
ఊళ్లోకి వచ్చాడే కానీ, ఊళ్లోకి అతడు ఎవరికోసముా రాలేదు. తనకోసం తను వచ్చాడు.
బెనర్జీ సిటీ లో ఉంటాడు.
ఎందుకు అతనికి ఊరు గుర్తొచ్చింది. అంతే. వచ్చేశాడు. ఊరంటే
అతడికి ఊరే. ఊళ్లోని అమ్మానాన్న కాదు. అక్కాచెల్లెళ్ళు, అన్నదమ్ములుా కాదు.
బంధువులు కాదు. స్నేహితులు కాదు. చీకట్లో ఊర్లోకి వచ్చి, చీకట్లోనే ఊళ్ళోంచి
వెళ్లిపోవాలనుకుని వచ్చాడు. ఊళ్లో తననెవరుా చూడకముందే వెళ్ళిపోవాలనుకున్నాడు.
అందుకు ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. వారందరినీ ఇంకోసారి ఎప్పుడైనా తీరిగ్గా
చూడొచ్చనుకొన్నాడు. ముందైతే ఊరిని చూడాలి. మెల్లగా ఊళ్లోకి నడక మొదలు పెట్టాడు
బెనర్జీ. దారులన్నీ డస్సిపోయినట్లు పడివున్నాయి. మలుపుల్లో ఒకట్రేండు కుక్కలు
బెనర్జీ వైపు తలెత్తి చూసి, మొరిగే ఓపిక లేనట్లుగా తిరిగి పడుకున్నాయి. ఊళ్లో నడక
అయ్యాక ఊరి చెరువు దగ్గరికి చేరుకున్నాడు బెనర్జీ. చెరువుగట్టున చిన్నప్పటి
మర్రిచెట్టు అలాగే ఉంది. వెళ్లి ఆ మర్రిచెట్టు కింద కూర్చున్నాడు. అది వట్టి
చెట్టు కాదు. ఊడలమర్రి. అతడిని కనుక ఆ సమయంలో అలా ఎవరైనా చూస్తే.. మనిషి అని మాత్రం
అనుకోరు.టైం
చూసుకున్నాడు బెనర్జీ. మూడయ్యింది. మర్రిచెట్టు కింద నుంచి అతనికి లేవాలనిపించడం
లేదు. బాల్యంలో ఈ ఊడలు చూస్తే అతనికి భయం. యవ్వనంలో ఆశ్చర్యం. ఇప్పుడు భయమూ లేదు,
ఆశ్చర్యమూ లేదు. మర్రిచెట్టు కు కాస్త దూరంలో స్మశానం ఉంటుంది. అమావాస్య
రాత్రుల్లో ఆ స్మశానంలో నుంచి దెయ్యాలు వచ్చి ఈ ఊడలు వేలాడుతూ కష్టం సుఖం
చెప్పుకునేవని ఊళ్లోవాళ్ళు అనుకునేవారు. అది గుర్తొచ్చి బెనర్జీకి నవ్వొచ్చింది.
ఆరోజు అమావాస్యేమెా అతడికి తెలియదు. బాగా చీకటిగా మాత్రం ఉంది. కాసేపు కళ్ళు
మూసుకున్నాడు బెనర్జీ. అలా ఎంత సేపు ఉండి పోయాడో తెలియదు. ఏదో అలజడి అయినట్లు
అనిపిస్తే కళ్ళు తెరిచాడు. ఎదురుగా.. ఎవరో పెద్దావిడ చెరువులో ముంచుకొచ్చిన
నీళ్ళబిందె ఆమె చేతుల్లో ఉంది. " ఏయ్యా.. బెనర్జీ.. ఎప్పుడొచ్చా! బాగున్నావా?
నువ్వు బెనర్జీవే కదా. ఇంత రాత్రప్పుడు ఇక్కడేమిటీ?" అంటుంది. కొన్ని క్షణాలకు
గాని ఆమెను పోల్చుకోలేకపోయాడు బెనర్జీ. చప్పున లేచి నిలబడ్డాడు. ఆమె కళ్ళల్లో
ఆపేక్ష. 'ఎన్నాళ్ళయింది నాయినా.. నిన్ను చూసి' అన్నట్లు చూస్తోంది. బెనర్జి ఆమెనే
చూస్తున్నాడు." సిటీకి వెళ్ళిపోయావంట.. అమ్మకి నాయనకి చెప్పకుండా! మంచిదేలే.
నాయనా ఎంత సంపాదించినా మగపిల్లాడు వాడి కాళ్ళ మీద వాడు బతికితేనే కదా గౌరవం"
అంది. ఇంకా.. ఒకట్రేండు మాటలు మాట్లాడింది. వెళ్లేటప్పుడు.." ఇంకా వెళ్తాను
నాయనా.. తెల్లారితే పనులు తెమలవు" అని చెప్పి వెళ్ళింది. అంతసేపు బెనర్జీ
మౌనంగానే ఉన్నాడు. ఆమె వెళ్ళాక టైమ్ చూసుకున్నాడు. నాలుగు అవుతుంది.
ముందైతే
బస్టాప్ కి వెళ్ళిపోయి, అక్కడినుంచి ఏదో ఒక బస్సు ఎక్కేసి, అక్కడినుంచి సిటీకి
వెళ్లి పోదామనుకున్నాడు బెనర్జీ. అయితే అతనికి శేఖర్ నే కలవకుండా వెళ్లడం కరెక్ట్
కాదనిపించింది. ఊరి చెరువులా, ఊడల మర్రిలా.. బెనర్జీకి శేఖర్ కూడా ఒక్కడు! బెస్ట్
ఫ్రెండ్. అయితే బెనర్జీ ఊరోదలడానికి ముందే, బెనర్జీతో శేఖర్ స్నేహం వదిలిపోయింది!
'ఊర్లో ఉండి ఏం చేస్తావ్? నాతో వచ్చెయ్' అని అన్నాడు బెనర్జీ.. ఊరొదిలి
వచ్చేయడానికి ముందురోజు. ఆ మాటకు శేఖర్ ఏమన్నాడో, అందుకు బెనర్జీ ఏమన్నాడో..
బెనర్జీ మర్చిపోలేదు. ఆ తర్వాతేప్పుడు బెనర్జీ, శేఖర్ ఒకర్నొకరు చూసుకోలేదు.
ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఇద్దరి నెంబర్లు ఇద్దరి దగ్గర ఉన్నాయి.ఇరవైఏళ్లలో ఏ
నెంబర్ నుంచి ఏ నెంబర్ కి ఫోన్ వెళ్ళలేదు. " ఒరేయ్ బెనర్జీ! నువ్వా! ఏమిటిలా?
ఇంత ఉదయాన్నే! ఎప్పుడొచ్చావ్ రా" అన్నాడు శేఖర్, బెనర్జీని ఇంట్లోకి రమ్మంటూ.
బెనర్జీ వెళ్లలేదు. 'వెళ్లిపోతాను' అన్నాడు. " ఇంట్లో అంతా బాగానే
ఉన్నారా?!" అన్నాడు శేఖర్. " ఇంటికి వెళ్లలేదు.
ఊరు చూసి వెళదామని
వచ్చాను. చూశాను. వెళ్తున్నాను. నిన్ను చూసి వెళదామని వచ్చాను" అన్నాడు
బెనర్జీ. శేఖర్ కి ఏమీ అర్థం కావడం లేదు. " మీ ఇంట్లో వాళ్ళని చూడకుండా..
నన్ను చూడటం ఏంట్రా?" అన్నాడు. " నీకు సారి చేబ్దామని వచ్చాను"
అన్నాడి బెనర్జీ. 'దీనికి?' అన్నట్లు చూశాడు శేఖర్. బెనర్జీ కళ్ళు తుడుచుకున్నాడు.
శేఖర్ కంగారుపడ్డాడు. " ఒరేయ్ శేఖర్.." ఊళ్ళో ఉండి ఏం చేస్తావ్? నాతో
వచ్చెయ్' అన్నప్పుడు నువ్వేమన్నావ్! 'తల్లి లాంటి ఊరిని వదిలి రాలేనురా' అనే కదా.
అప్పుడు నేనేమన్నాను? 'తల్లే పోయాక, తల్లి లాంటి ఊరేమిట్రా' అన్నారు కదా"
అన్నాడు బెనర్జీ. " అంటే ఏమైందిరా?" అన్నాడు శేఖర్. " అలా
అన్నందుకు.. సారి.. రా".. అని శేఖర్ చేతిని కళ్ళకు తాకించుకుని, వెంటనే
అక్కడి నుంచి ఆ చీకట్లో బస్టాండ్ కి బయల్దేరాడు బెనర్జీ. ఆ రాత్రి ఊడలమర్రి దగ్గర
శేఖర్ తల్లి తనకు కనిపించిన విషయాన్ని అతడు తన మనసులోనే ఉంచేసుకున్నాడు.
నాతో వచ్చెయ్!
Reviewed by Smartbyte group
on
August 28, 2018
Rating:

No comments: