గౌరవం


                          దయం పది దాటింది. మిర్యాలగూడ హౌసింగ్ బోర్డ్ కాలనీలో తన ఇంటిముందు ఆటో ఆపించాడు యాదకృష్ణయ్య. ముందు అతడు దిగాడు తర్వాత అతని భార్య పద్మ దిగింది. సూట్ కేస్, రెండు ట్రావెలింగ్ బ్యాగులు, ఒక ప్లాస్టిక్ బుట్టను ఆటోలు నుంచి దించారు. ఆటో వెళ్ళిపోయింది. యాదకృష్ణయ్య తలుపుకున్న కర్టెన్ ను పక్కకి జరిపే సరికి తాళంకప్ప కనిపించింది. అతని వెనకే వచ్చిన పద్మ అడిగింది. "అత్తమ్మ ఈ వేళప్పుడు యాడికి వెళ్ళింది?" యాదకృష్ణయ్య 'ఏమెా' అన్నట్లు పెదవి విరిచాడు. భార్య భర్తలు ఇంటి ముందు నిలబడి ఉండే సరికి పక్కింటి దేవకి వాళ్ళని చూసి అడిగింది. "ఏంది యాదయ్య! కమలమ్మ లోపల లేదా?" "లేదత్తా తాళం వేసింది." అన్నాడు." పొద్దుటిసంది కన్పించలే! రాత్రి ఇంటికి రాలేదేమో? అన్నది దేవకి కళ్లెర్రజేస్తూ. ఆమె మాటల్లో వెటకారం ధ్వనించి అతనికి చిరాకు కలిగింది. కమలమ్మ సాగర్ రోడ్ లో ఉన్న సరిత వైన్స్ దగ్గర బజ్జీల దుకాణం నడుపుతుంది. రోజు రాత్రి పన్నేండుకు వస్తుంది. తల్లి ఆ బజ్జీల బండి నడపడం యాద కృష్ణయ్యకు ఇష్టం లేదు. అర్ధరాత్రులు రావడమే కాకుండా, ఒకసారి అసలు ఇంటికే రాదు. 'మా తమ్ముడు ఇంట్లో పండినా!' అని చెప్తుంది. యాద కృష్ణ తండ్రి జానయ్య ఆర్డీఓ ఆఫీస్ లో అటెండర్. చాలీచాలని జీతం అని భార్య కమలమ్మ బజ్జీల దుకాణం ప్రారంభించింది. 

                            ప్పుడు యాద కృష్ణ చిన్నోడు. తర్వాత జానయ్య చనిపోయాడు. కారుణ్య నియామకం వల్ల యాద కృష్ణయ్య కు రెవిన్యూ లో అటెండర్ ఉద్యోగం ఇచ్చారు. ఇంటర్ ఫెయిల్ అవడంతో చదువు ఆపేసి ఆటో నడుపుతున్న యాద కృష్ణయ్య అటెండర్ గా చేరాడు. ప్రైవేట్ గా డిగ్రీ చదువుతున్నాడు ఓపెన్ యూనివర్సిటీలో. డిగ్రీ చేతికొస్తే జూనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్ ఇస్తారు. జానయ్య పోయాక గ్రాట్యుటీ, పిఎఫ్ వగైరా కొంత డబ్బు వచ్చింది. కమలమ్మకు పెన్షన్ వస్తున్నది. ఇక బజ్జీలు వేయడం మానేయ్. ఇజ్జత్ పోతుంది అని కోరుతున్నాడు. కానీ కమలమ్మ ససేమిరా అన్నది. ఇంట్లో మనకేం తొచదనీ, ఎప్పటినుంచో చేస్తున్న పని, ఆదాయం వస్తున్నది, ఎందుకు మానాలని వాదిస్తుంది. అందుకే తల్లి మీద కోపంగా ఉంది యాద కృష్ణయ్యకు. " తమ్ముడింట్లో పడిందేమో రాత్రి. ఎప్పుడొస్తాదో. మా ఇంటికి రండి అన్నది దేవకి. యాద కృష్ణ, పద్మ ఇద్దరు దేవకి ఇంటికి వెళ్లారు సామాను తీసుకుని. భార్యభర్తలిద్దరు దసరా పండక్కి రంగాపురం వెళ్లారు నాలుగు రోజుల క్రితం. ఆఫీసుకి వరుస సెలవులు రావడంతో యాద కృష్ణయ్య కూడా అత్తారింట్లో ఉన్నాడు. రేపు మళ్లీ ఆఫీస్ కి వెళ్లాలని ఒకరోజు ముందే మిర్యాలగూడ కు వచ్చేశారు. భార్యను పక్కింట్లో కూర్చోబెట్టి యాద కృష్ణయ్య నాగార్జునసాగర్ కెనాల్ క్వార్టర్స్ లొ ఉంటున్న మేనమామ ఇంటికి వెళ్లాడు. తల్లి అక్కడ లేదన్నారు. సరిత వైన్స్ ఇంకా తెరవలేదు. తిరిగి వచ్చేసాడు. " అత్తా! మా అవ్వ మా ఇంట్లో లేదు. రాత్రి రాలేదంట." అని దేవకి తొ చెప్పాడు. కమలమ్మ సెల్ ఫొన్ వాడదు. ఎటుపోయిందో అర్థం కాలేదు ఇరుగుపొరుగు వాళ్ళకి. " తాళం పగలగొట్టు" అని ఒక ఆమె సలహా ఇచ్చింది.
" యాదయ్య! ఎందుకైనా మంచిది పోలీస్ కంప్లైంట్ ఇవ్వు" అన్నాడు అక్కడ కిరాణాకొట్టు నడుపుతున్న వెంకటాద్రి. యాద కృష్ణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తల్లి కనిపించడంలేదని, ఇంటికి తాళం వేసి ఉందని కంప్లైంట్ రాసిచ్చాడు. " మీ అమ్మకు ఏభై ఏళ్లంటున్నావు? ఎక్కడ తప్పి పోద్ది? చిన్నపిల్లేం కాదుగా!" అన్నాడు ఇన్ స్పెక్టర్. యాద కృష్ణకు జవాబు ఏం చెప్పాలో తోచలేదు. " అత్తగారి ఇంటి నుంచి ఇప్పుడే వచ్చాం. నా భార్య బయటే ఉంది. ఇంటి తాళం పగలగొట్టమంటారా?" అని అడిగాడు. " ఆ పని చెయ్యి. మీ అమ్మ ఫోటో ఒకటి తెచ్చివ్వు" అన్నాడు ఇన్ స్పెక్టర్.  యాద కృష్ణ ఇంటికి తిరిగొచ్చాడు. ఇరుగుపొరుగు ఆడవాళ్ళు బయట నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నారు. కమలమ్మ ఇంటికి రాక, తమ్ముడు ఇంట్లో లేక ఎక్కడికి పోయిందని మాట్లాడుకుంటున్నారు. వెంకటాద్రి షాపులో సుత్తి తెచ్చి తాళంకప్ప పగలగొట్టాడు. 'హమ్మయ్య! అని నిట్టుార్చి తలుపులు తెరిచాడు. పద్మ, యాద కృష్ణలు సూట్ కేస్, ట్రావెలింగ్ బ్యాగులు మెాసుకొని ఇంట్లోకి వెళ్ళారు. బెడ్ రూమ్ లోకి వెళ్ళిన పద్మ కెవ్వుమని కేకలు పెట్టుకుంటూ పరిగెత్తుకొచ్చింది రోడ్డు మీదకు. " ఏందే..?" అంటూ అతను బెడ్ రూమ్ లోకి చూశాడు. కమలమ్మ బెడ్ మీద చచ్చిపడుంది. తల పగిలి నెత్తురు కారి గడ్డకట్టి ఉంది. ఎవరో తల పగల కొట్టి చంపారు. యాద కృష్ణయ్య కూడా రోడ్డు పైకి వచ్చాడు. పద్మ చుట్టుా జనం చేరారు. అత్తను ఎవరో చంపేశారని ఏడుస్తూ చెప్తుంది. యాద కిష్ణ నేల మీద కూలబడి ఏడుస్తున్నాడు. కమలమ్మను ఎవరో హత్య చేశారని కాలనీ అంతట తాటాకు మండల సమాచారం చేరిపోయింది. వెంకటాద్రి తన షాపులో ఉన్న ల్యాండ్లైన్ నుంచి పోలీసులకు ఫోన్ చేసి, జరిగిందంతా చెప్పాడు. గంట తర్వాత ఎస్సై, ఇన్ స్పెక్టర్, నలుగురు కానిస్టేబుల్స్ వ్యానులో వచ్చి దిగారు. తర్వాత శవాన్ని పోస్టుమార్టం కోసం ఏరియా ఆస్పత్రికి పంపించారు పోలీసులు. " యాద కృష్ణయ్యా! మీ అమ్మ ని హత్యచేసింది దొంగలు కాదు. దొంగ అయితే ఆమె వంటి మీద ఉన్న బంగారం ఎత్తుకెళ్లి పోయేవాళ్ళు. ఎవరో పగబట్టి చంపారు. చెప్పు? ఎవరి మీదనైన అనుమానం ఉందా?" ప్రశ్నించాడు ఇన్ స్పెక్టర్. " సార్! మాకు శత్రువులు ఎవరూ లేరు. నాకైతే బిక్షపతి మీద అనుమానంగా ఉంది" చెప్పాడు యాద కృష్ణయ్య. " బిక్షపతి ఎవరు?" " సరిత వైన్స్ యజమాని" " అతను మీ అమ్మను ఎందుకు చంపుతాడు?" " సార్! మా అవ్వ అక్కడ బజ్జీల దుకాణం నడుపుతోంది. మా నాయన పోయినాక డబ్బులు వచ్చింది. వడ్డీ ఇస్తానని నాలుగు లక్షలు తీసుకున్నాడు. మూడేళ్లయింది. డబ్బు ఇవ్వమని అడుగుతుంటే అదిగో అని తిప్పుతుండు సార్! డబ్బు తీసుకున్నానని కాగితం కూడా రాసియ్యలేదు!" కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు యాద కృష్ణయ్య.
బిక్షపతి ని పోలీస్ స్టేషన్ కి పిలిపించి ప్రశ్నించారు పోలీసులు. " సార్! కమలమ్మ దగ్గర నాలుగు లక్షలు అప్పుగా తీసుకున్న మాట నిజమే. నెలకు పది వేలు ఆమె ఖాతాలో జమ చేస్తున్నా. ఆమె డబ్బు తిరిగి ఇవ్వమని అడగలేదు. అడిగితే ఇచ్చే వాడిని. నేను వైన్ షాప్ కాక సాగర్ రోడ్ లో అపార్ట్మెంట్స్ కట్టిస్తున్నా. డవలప్ మెంట్ కని అప్పుచేసి గాని, నాకు డబ్బు ఇబ్బంది లేమీ లేవు. కమలమ్మను చంపాల్సిన అవసరం నాకు లేదు." అన్నాడు బిక్షపతి. తను ఆమె పేరుతో బ్యాంకులో జమ చేస్తున్న వివరాలు, రసీదులు చూపించాడు. బిక్షపతి మాటల్లో నిజాయితీ ఇన్ స్పెక్టర్ గ్రహించాడు. బిక్షపతి గురించి పోలీసులు ఎంక్వయిరీ చేయించారు. కమలమ్మ మంచి రంగులో అందంగా ఉంటుంది. సరిత వైన్స్ దగ్గర బజ్జీలు వేస్తూ బిక్షపతి కి పరిచయమైంది. ఇద్దరికీ అక్రమ సంబంధం ఏర్పడింది. అప్పుడప్పుడు ఇద్దరూ లాడ్జీలో గడుపుతారని తెలిసింది.
" సార్! ఈ రంగాపురంలో అత్తగారింట్లో ఉన్నట్లు  యాద కృష్ణ చెప్తున్నాడు. వాడి ఎలిబి చెక్ చేయాల్సి వుంది. రంగాపురం ఇక్కడికి పది కిలోమీటర్ల దూరం. నాకెందుకు యాద కృష్ణయ్య మీద అనుమానం గా ఉంది" అని ఎస్సే అన్నాడు ఇన్ స్పెక్టర్ తో. " సరే! రంగాపురం వెళ్లి ఎంక్వయిరీ చేయండి" అన్నాడు ఇన్ స్పెక్టర్. ఎస్సై, హెడ్, ఇద్దరు కానిస్టేబుల్స్ రంగాపురం బయలుదేరి వెళ్లారు. ఊరి మధ్యలో పంచాయతీ ఆఫీసు పక్కన సైకిల్ షాపు, మెకానిక్ షెడ్ నడుపుతున్న రాజమెాహన్ పోలీస్ వ్యాన్ రావడం చూసి పొలాల్లోకి పారిపోయాడు. కానిస్టేబుల్స్ తరిమి పట్టుకున్నారు. రాజమెాహన్ గజగజా వణికిపోయాడు. " సార్! నాకేం ఎరిక లేదు. యాదయ్య రమ్మంటే బైకు తోలి నా సార్. అర్ధరాత్రి ఎందుకంటే అర్జెంటు అన్నాడు. నేను వాళ్ళ ఇంటికి దూరంగా బైకు ఆపిన! యాదయ్య అరగంట తర్వాత వచ్చాడు. ఫుల్లుగా తాగి ఉన్నాడు సార్. అవని కతం చేసేసినరా! ఇజ్జత్ తీస్తుంది పాడు ముండ అన్ని బూతులు తిట్టాడు సార్!" అని చెప్పాడు రాజమోహన్. కమలమ్మ హత్యకేసు తేలిపోయింది. కన్నకొడుకే ఆమెను దారుణంగా హత్య చేశాడు. యాద కృష్ణయ్యను అరెస్ట్ చేశారు పోలీసులు. తల్లిని హత్య చేశానని ఒప్పుకున్నాడు.
    "ఇజ్జత్ తీస్తుంది సార్! బిక్షపతి తోనూ లాడ్జీల్లో పండుతుంది. కాలనీలో అందరికీ ఎరికైంది సార్! తిరుగుడు మానుకోమని కొట్టినా సార్! బజ్జీల దుకాణం ముయ్యమని మొత్తుకున్నా! నాకు పెళ్లయింది. కోడలోచ్చింది. దీని తిరుగుడు దానికి ఎరుకైంది. ఇజ్జత్ పోతుంది అన్న వింటేేనా సార్! అందుకే ఖతం చేసినా!" ఏడుస్తూ చెప్పాడు యాద కృష్ణయ్య.

గౌరవం గౌరవం Reviewed by Smartbyte group on August 31, 2018 Rating: 5

No comments: