అన్నదమ్ముల గొడవలు వాటాలు ఇంట్లో దీపం వెలిగించే
దిక్కులేక పాడుబడిపోయింది. వాళ్ల తండ్రి పోయాక అన్నదమ్ములు నలుగురికి
పెళ్లిళ్లయ్యాని, ఎవరు మట్టుకు వాళ్ళు వేరే కాపురాలు పెట్టుకున్నారని చెప్పాడు.
అందరిలో ఆఖరివాడైన శంకు కే ఆ ఇల్లు ఇద్దామని వాళ్ళల్లో కోరికట. శంకే ఓరోజు
సొసైటీలో ఉండగా తన కథంతా చెప్పాడు. నేరుగా లోపలి ఉన్న గదిలోకి తీసుకెళ్లాడు శంకు.
మౌనంగా అనుసరించాను. గది తలుపులు తెరవడానికి తటపటాయిస్తున్నాడు. దగ్గరగా మూసుకున్న
తలుపుల్ని టక్కుడ కాలితో తన్నాడు. తలుపులు రెండ్లు బార్ల తెరుచుకున్నాయి. లోపల
దృశ్యం చూసి ఒకసారీ అదిరిపడ్డాను. శంకు మాత్రం బాధతో గబుక్కున కళ్ళు మూసుకున్నాడు.
ఎదురుగా శంకు పెద్దన్నయ్య. మా సొసైటీ ప్రెసిడెంట్. గదిలో వున్న కిటికీ రాడ్ కు
తాడు కట్టి ఉరి పోసుకుని చచ్చి పడి ఉన్నాడు. శంకే తేరుకొని గబాలున వెళ్ళి
వాళ్ళన్నయ్య మెడకు ఉన్న తాడు కత్తెరతో కత్తిరించబోయాడు. నేను టక్కున అడ్డుకుని వద్దని
వారించాను. ఇంట్లో వాళ్ళకి కబురు చెప్పి ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని శంకుని
బలవంతంగా బయటకు లాక్కోచ్చాను. శంకు దుఃఖం ఆపుకోలేకపోతున్నాడు.
ఇద్దరం రోడ్డుమీద కి
వచ్చాము. ఇంతలో మా సోసైటీ వైస్ ప్రెసిడెంట్ శివ రామ్మూర్తి గారు అటుగా వస్తూ
మమ్మల్ని చూసారు. గుండెల్లో నుంచి తన్నుకొస్తున్న దుఃఖం ఆపుకుంటూ కళ్ళు
తుడుచుకుంటున్న శంకుని చుాసి "ఏమైంది?" అంటుా శంకు భుజం మీద
చెయ్యేసాడయన. ఏడుస్తూ జరిగింది చెప్పాడు శంకు. "కొంపలంటుకుంటాయ్.పోయినోడు
చక్కగానే ఉరైసుకు చచ్చిపోయాడు. ఇది గాని పోలీసులకు తెలిస్తే అందరిని అనుమానంతో
చంపుకుతింటారు. ఊరందరికీ విషయం తెలియక ముందే శవాన్ని మామూలుగా పడుకోబెట్టేద్దాం.
ఏదో జ్వరంతో చనిపోయాడని జనాల్ని నమ్మించాలి. ఎవరికీ అనుమానం రాకుండా మీ వాళ్ళకు
కబురు చెయ్యి.." అంటూ ముందుకు సాగిపోయాడయన. ఆయనన్నది కరెక్టే అనిపించింది.
పావుగంటలో శంకు అన్నదమ్ములతో పాటు వాళ్ళ అమ్మగారు వచ్చేశారు. ఉరితాడు కత్తిరించి
ఇంటి బయట చాప పరిచి శవాన్ని తిన్నగా పడుకోబెట్టారు. ఊరందరికీ విషయం తెలిసే లోగా
స్మశానానికి తీసుకోవడం మంచిదని రామ్మూర్తిగారే దగ్గరుండి కార్యక్రమాలు ఆదరాబాదరా
పడుతూ పూర్తి చేయించాడు. నాకు ఆ క్షణం ఆయన మీద వీసమెత్తు అనుమానం కూడా కలగలేదు.
శవాన్ని నిలువుగా పడుకోపెట్టినా కాళ్ళు రెండు ముడుచుకుని బిగుసుకుపోయాయి. నిటారుగా
సాగదీద్దామని శంకు అన్నదమ్ములు, బంధువులు ఎంత ప్రయత్నించినా కుదరలేదు. శవానికి
స్నానం చేయించినప్పుడు నేనే కాదు అక్కడున్నవాళ్లంతా అదిరిపడ్డారు. మా సొసైటీ వైస్ ప్రెసిడెంట్
శివ రామ్మూర్తిగారైతే తలబాదుకుని ఏడ్చేశారు. "అయ్యో ఎంత పనైపోయిందిరా
తమ్ముడుా. తప్పు చేశాం రా! వీడేదో తాగిన మైకంలో బాధలు తట్టుకోలేక ఓరి
పోసుకున్నాడనుకున్నాను. ఇలా జరుగుతుందని ఊహించలేదురా! విడ్నేవరో చంపేశార్రా
తమ్ముడుా.
చంపేసి మీ ఇంట్లోనే ఉరి పోసుకుని చచ్చిపోయినట్లు తెచ్చి పడేశారు"
అంటూ తలబాదుకుని ఏడ్చాడాయన. శవం మీద రక్తం మరకలు అది హత్య అని చెప్తున్నాయి.
"ఇప్పుడేం చేద్దాం.." అంటూ శివరామ్మూర్తిగారి దగ్గరికోచ్చి అడిగారు
ముగ్గురుా. " పోలీస్ రిపోర్ట్ ఇస్తే హంతకులెవరో తెలుస్తుంది. కానీ మనం
తొందరపడి శవాన్ని ముట్టుకున్నాం. ఉరితాడు కట్ చేశాం. ఇప్పుడు శవానికి స్నానం కూడా
చేయించేశాం. హంతకుడి ఆధారాలన్నీ మన చేతులతో మనమే తుడిచేశాం. ఇప్పుడేం చేయాలో తోచడం
లేదు" అన్నాడాయన. చనిపోయినవాడు ఎలాగో పోయాడు. ఇక లేనిపోని పెంట నెత్తి మీదకు
ఎందుకుని నిర్ణయించుకున్నారు సింకు అన్నదమ్ములు. శవాన్ని స్మశానానికి
తీసుకువెళ్తున్న సమయంలో పెడబొబ్బలు పెట్టుకుంటూ వచ్చింది శంకు పెద్ద వదిన. పిల్లలు
ముగ్గుర్నీ వెంటపెట్టుకు వచ్చిందావిడ. పాపం చిన్నపిల్లలు. ఆర్నెల్ల నుండి భార్య
పిల్లలకు దూరంగా ఉంటున్నాడట. భర్త చావు వార్త విని ఆమె వాళ్ళ పుట్టింటి నుంచి
పిల్లల్ని తీసుకుని బావురుమంటూ పరిగెత్తుకొచ్చింది. స్మశానం నుండి ఇంటికి వచ్చాను
కానీ నా మనసు మనసులో లేదు. ఉరిపోసుకు చావలేదన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఎవరో
హత్యే చేశారు. ఈ ఊర్లో ఆయనకి శత్రువులేవరబ్బా?
ఆ
రోజు
శంకుా నేనుా సినిమాకి వెళ్ళాము. నేను బలవంతంగా శంకుని లాక్కెళ్లాను. "
అన్నయ్యకి శత్రువులెవరున్నార్రా? వెధవలు మీ అన్నయ్య ని బాగా చిత్రవధ చేసి
చంపేశార్రా!" శంకును రెచ్చగొట్టాలని అలా అన్నాను. కోపంవస్తే కొంతైనా వాళ్ళ అన్నయ్య వెనుక దాగి ఉన్న నిజాలు
చెప్పాడని. " నువ్వన్నది నిజమేరా, అదే చేసుంటుంది" కసిగా పళ్లు కొరుకుతూ
అన్నాడు. " బ్రాందీ షాపు దగ్గర చికెన్ చీకులు అమ్ముతుందే అది" కోపంగా
అన్నాడు శంకు. " ఆవిడా!" ఆశ్చర్యంగా అన్నాడు. " మా అన్నయ్య కి ఎలా
తగిలిందో తెలీదురా... రాత్రి పగలు దానింట్లోనే ఉండేవాడని అంటార్రా అందరూ"
బాధగా అన్నాడు శంకు. ఆ మర్నాడు రుణాలు వసూలుకి ఊరిమీదకి బయలుదేరాను. దారిలో
బ్రాందీ షాప్ కనిపించింది. దాని పక్కనే శంకు చెప్పిన ఆవిడ చీకుల కొట్టు
కనిపించింది. అప్రయత్నంగా అటు వెళ్లాను." ఏం బాబు ఇలా వచ్చావు? ఒక కవాపుల్ల
తింటావా?" అంటూ అప్పుడే నిప్పుల మీద కాల్చిన చికెన్ ముక్కలు చూపిస్తూ అడిగిందామె.
ఒక కర్రకు గుచ్చి ఉన్నాయవి. దాన్నే చీకులు అంటారేమో అని అనుకున్నాను. " మా
ప్రెసిడెంట్ గారు చనిపోవడం చాలా బాధాకరం కదా! ఆయనకుా మీకు మంచి స్నేహం ఉందని, ఆయనే
మీకు లోను ఇప్పించారని విన్నా" అన్నాను ఆమె కళ్ళలోకి చూస్తూ. " అయ్యో!
ఆయన అంత ఏగిరం పడే మనిషి కాదు బాబు. బ్రాందీ షాపు కొస్తే సొసైటీ ప్రెసిడెంట్ గోరు
కదా మీ ఇంట్లో కూర్చొని మందు తాగుతారు అని బ్రాందీ షాపు ఓనర్ గారు చెప్పిన దగ్గర
నుంచి మా ఇంట్లో కూర్చుని మందు తాగి వెళ్ళిపోయేవారు బాబు అంతే!" అంది ఆమె.
ఇంతకంటే ఆమె నుంచి ఎక్కువ రాబట్టలేనమనిపించింది. ఆ మర్నాడు సొసైటీలో కూర్చున్నాను.
శివరావు ఏడుపు మెుహం పెట్టుకుని కూర్చున్నాడు. " గురుా! నీకు తెలుసా! మన
ప్రెసిడెంట్ గాని బ్రతికి ఉంటే ఈ సెక్రటరీగాడి పనైపోను." కసిగా పళ్ళు
కొరుకుతూ అన్నాడు అటెండర్ శివరావు." నిజమా?" ఆశ్చర్యంగా అడిగాడు. "
ప్రెసిడెంట్ గారి పేరు చెప్పి రైతులందరి దగ్గరా అప్పులిస్తుా డబ్బులు
నొక్కేస్తున్నారని తెలిసిందట. అంతే! ఆయన ఆఫీసుకు వచ్చి గది తలుపులు వేసి మరీ
బండబూతులు తిట్టాడు. ఈ నెల్లో ఈయన గార్ని మన సొసైటీ నుంచి సాగనంపేస్తానని కూడా
అన్నారు" అన్నాడు. నాకంతా అయోమయంగా ఉంది. ప్రెసిడెంట్ కి తెలియకుండా ఇన్ని
లక్షలు అప్పులిస్తుా లంచాలు తీసుకుంటున్న సెక్రెటరికిీ ఆయన్ని చంపేసేటంత ధైర్యం
ఎక్కడిది? " మన వైస్ ప్రెసిడెంట్ శివరామ్మూర్తిగారు మధ్య పడకపోతే ఎలా
ఉంటుందో" మళ్లా శివరావే అన్నాడు. "శివరామ్మూర్తిగారా?" ఆశ్చర్యంగా
అన్నాను. " అవును. సెక్రటరీగాడెళ్లి ఆయన దగ్గర తనగోడు వెళ్లబోసుకున్నాడు.
ప్రెసిడెంట్ గారు చనిపోయే ముందు రోజే రాజీ కోసం ముగ్గురుా ఈ రంభ ఇంట్లో మందు
పార్టీ చేసుకున్నారు గురుా" అన్నాడు శివరావు. ఉలిక్కిపడ్డాను. నాకెందుకు
ఎక్కడో, ఏదో జరిగింది అనిపిస్తుంది. శంకు కోసం సెల్ తీసి ఫోన్ చేశాను. నా
అనుమానాలన్నీ వాడికి పూసగుచ్చినట్టు చెప్పాను. ఇద్దరం బ్రాందీ షాపు దగ్గరకు
వెళ్ళాము. అక్కడికి కొద్ది దూరంలోనే ఉంది చీకులు దుకాణం. దాని వెనకే ఉన్న రంభ
ఇంటికి వెళ్ళాము. వాళ్ళాయన లేడు ఎక్కడికో వెళ్ళాడు అని చెప్పింది. "
బ్యాంకోళ్లిద్దరూ మా ఇంటికోచ్చేసారేం బాబుా" అంది నవ్వుతూ. " నీతో మాట్లాడాలి"
అన్నాను నేను.".. మన సొసైటీ ప్రెసిడెంట్ ఆత్మహత్య చేసుకోలేదు.
ఎవరో చంపేసి
అక్కడ పడేసారు" అన్నాను నేను ఆమె కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ. " నిజమా!
ఎంత ఘోరం" ఆశ్చర్యం నటిస్తూ అంది రంభ. " చనిపోయిన రాత్రి మా అన్నయ్య మీ
ఇంట్లోనే ఉన్నాడట కదా" శంకు కోపంగానే అన్నాడు. ఆ మాటకు ఒకేసారే అదిరిపడింది.
తేరుకుని,-" అవునవును బాబు.. ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు,
శివరామ్మూర్తిగారు ముగ్గురుా ఉన్నారు. వాళ్లతో మా ఆయన కూడా ఉన్నాడు." అంది
తడబడుతుా. " ఆరోజు ఇక్కడే గొడవపడి మీరే మా ప్రెసిడెంట్ గారిని చంపేశారని
తెలిసింది." కావాలనే అబద్దం ఆడాను." అయ్యో! గొడవపడ్డం మాట నిజమే. మీ
అన్నయ్యగారే సెక్రెటరీగారితో గొడవ పడ్డారు. ఆ గొడవ లోనే చిన్న తోపులాటలో మీ
అన్నగారి తల బలంగా గోడకు తెలిసింది. అంతే మీ అన్నగారు సొమ్మసిల్లి పడిపోతే మా ఆయనే
సాయం చేసి ఆటో ఎక్కించాడు. తర్వాత ఏమైందో నాకు తెలీదు." అంది భోరున ఏడుస్తూ.
ఆ వెంటనే ఇదంతా పోలీసు కమిషనర్ ఆఫీసుకు వెళ్లి చెప్తాము. ఆ మర్నాడు పోలీస్ జీపు
నేరుగా వచ్చి మా సొసైటీ ముందు ఆగింది. సెక్రటరీని, ప్రస్తుత ప్రెసిడెంట్
శివరామ్మూర్తి గారిని జీపులో ఎక్కించుకుని వెళ్లారు పోలీసులు. ఆ విషయం ఊరంతా గుప్పుమంది.
ఆ మధ్యాహ్నం పోలీసులు రెండు మూడు జిపుల్లో వచ్చి నేరుగా స్మశానానికి వెళ్లారు.
వాళ్లతో పాటు శంకు కుటుంబ సభ్యులందర్నీ తీసుకువెళ్లారు. శవాన్ని పోస్టుమార్టం కోసం
పెద్దాస్పత్రికి తీసుకుపోయారు పోలీసులు. రెండు రోజుల ఇంటరాగేషన్ కోసం పోలీస్
కస్టడీలో ఉన్నారు సెక్రటరీ, కొత్త ప్రెసిసెంట్ శివరామమూర్తి. మూడోరోజు ఇద్దరు
సొసైటీకి వచ్చారు. వస్తూనే నన్నుా, శంకుని తన కేబిన్ లోకి పిలిచాడు ప్రెసిడెంట్
శివరామ్మూర్తి. అతని పక్కనే సెక్రటరీ కూడా కూర్చున్నాడు. " మీ ఇద్దరూ మంచి
పని చేశార్రా! చనిపోయే ముందు రోజు మేము ముగ్గురం కలిసి మందు కొట్టడం నిజమే.
సెక్రటరీగారు, మీ అన్నయ్య గొడవపడ్డం నిజమే. కానీ వాణ్ని మేము చంపలేదురా. చేతులారా
స్నేహితుడిని చంపేసేంత దుర్మార్గుడిగా కనిపిస్తున్నానా?" దాదాపు
ఏడుస్తున్నట్లు అన్నాడు శివరామ్మూర్తి. " ఆరోజు ఆటో ఎక్కించి తీసుకొస్తూ
సోడాతో మొహం అడిగేసరికి మీ అన్నయ్య తెలివిమీదకు వచ్చాడు. మీ అన్నే తనింట్లో
పడుకుంటాను దించెయ్యమంటే ఆ గదిలో చాప మీద పడుకోబెట్టి వచ్చేసాము. అంతే మాకు
తెలిసిన నిజం." అంటూ చెప్తాడు సెక్రటరీ. అదేసమయంలో పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్
వచ్చింది. హంతకుడు దొరికాడు. నలుగురం పోలీస్ స్టేషన్ దగ్గరికేళ్ళేసరికి బయట రంభ
ఏడుస్తూ నిలబడి ఉంది. ఎస్సై ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు రంభ మొగుడు. "
వీడే మీ సొసైటీ ప్రెసిడెంట్ ని చంపేశాడు. చెప్పరా.. చెప్పు." అంటూ పక్కనే
చేతులు కట్టుకు నిలబడ్డ రంభ మొగుడిని లాఠీతో కొడుతూ అన్నాడు ఎస్సై. " అవును
నేనే.. నేనే చంపేశాను. ఆటోలో మీరు అతణ్ని వాళ్ళ పాడుపడ్డ ఇంట్లో దించి వెళ్ళడం
చూసాను. అర్ధరాత్రి ఎవరు చూడకుండా వెళ్లి గొంతునులిమి చంపేశాడు." కసిగా
అన్నాడు రంభ మొగుడు. " అతణ్ని చంపాలన్న పగ నీకెందుకు?" అడిగాడు ఎస్సై.
" మా ఆవిడ.. మా ఆవిడతో తిరిగితే నేను ఊరుకుంటానా?" కోపంగా అరిచాడు. మా నలుగురికి
నోటమాట కరువైంది. ఇందులో నిజమెంతో.. అబద్ధమెంతో ఆ భగవంతుడికే తెలియాలి. నిజం
చెప్పగలిగిన రంభ " చనిపోయిన దేవుడులాంటి మనిషి మీద లేనిపోని అభాండాలు
వేయ్యకండి బాబు." అంటూ తలబాదుకుని ఏడుస్తుంది.
అభాండం
Reviewed by Smartbyte group
on
August 29, 2018
Rating:

No comments: