కూతురు


                దేవుళ్లకు పేర్లేమిటి అనిపిస్తుంది ఒక్కోసారి! 'దేవుడు' అంటే సరిపోదా? అతను, ఇతను ఆ చీకట్లో కొద్దిసేపటికి నడుస్తున్నారు. వాళ్ళిద్దరే నడుస్తున్నారు. అతనికొక పేరుంది. ఇతనికోక పేరు ఉంది.. కానీ ఇక్కడ.. వాళ్ల పేర్లు అవసరం లేదు. ఇది కథ అయితే కథ నడవడం కోసం పేర్లు అవసరమే. కానీ ఇది కథ కాదు, ఈ కథ నడవను అవసరం లేదు. వాళ్ళిద్దరూ నడుస్తున్నారు. అది చాలు. ఇద్దరికీ కొద్దికాలంగా పరిచయం. ఉదయం ఇంటి నుంచి వెళ్తున్నప్పుడో, రాత్రి పొద్దుపోయాక ఇంటికి వస్తున్నప్పుడో ఒకరికొకరు కనిపిస్తే కనిపిస్తారు. కనిపించినప్పుడు ముందు అతను ఇతన్ని చూస్తే ఎంత దూరంలో ఉన్న గట్టిగా 'ఓయ్' అని పిలుస్తాడు. ముందు ఇతను కనుక అతన్ని చూస్తే.. పెద్దగా 'సార్' అని పిలుస్తాడు. ఇలా ఇద్దరూ కలుసుకుంటారు. కలిసి నడుచుకుంటూ వెళ్తారు. మాట్లాడుకుంటూ నడుస్తారు. అలా నడుస్తూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒకరివైపు ఒకరు చూసుకోరు. ఆ చీకటి దారిలో (కలుసుకున్నది రాత్రైతే) దారికి ఒకపక్కగా నడుస్తారు. ఎదురుగానో, వెనుకనుంచో అప్పుడోకటిీ, ఇప్పుడోకటీ వచ్చే వాహనాలు మరీ వేగంగా ఉన్నప్పుడు మాత్రం అతను అతనిని తన పక్కకి లాక్కుంటాడు.  'జాగ్రత్త' అంటాడు. 'పర్లేదు సార్' అని ఇతను అంటాడు. అప్పుడు కూడా ఒకర్నొకరు చూసుకోరు. అతను 'ఓయ్' అనడం కమాండింగ్ గా ఉంటుంది. 

                       డక కూడా కవాతు చేస్తున్నట్లు ఉంటుంది. వేగంగా నడుస్తాడు. ఆ వేగాన్ని ఇతడు ఎప్పుడూ అందుకోలేడు. ఇతను అందుకోలేకపోతున్నాడు కదా అని అతను ఎప్పుడుా తన వేగాన్ని తగ్గించుకోవడు. నడక మాత్రం కలిసే! అతను అతని కన్నా కొద్దిగా పెద్దవాడు. ఎత్తుగా, దూరంగా ఉంటాడు. అతనే ఎక్కువగా మాట్లాడుతుంటాడు. మాట్లాడటం కాదు, చెబుతుంటాడు. ఏదో ఒకటి! అది బాగుంటుంది ఇతనికి. ఇతనికి వినడం ఇష్టం. అందుకు బాగుంటుందేమో. ఇతను అతని భుజాల దగ్గరికి వస్తాడు. బాగా వదులు చొక్కా, టైట్ ప్యాంట్ వేసుకుంటాడు. కాళ్లకు ఒంటిపొర లెదర్ చెప్పులు ఉంటాయి. కాస్త వంగి నడుస్తాడు. 'స్ట్రైట్ గా నడువ్' అని ఫట్ మని కొన్నిసార్లు వీపు మీద కొడతాడు అతను ఇతన్ని. 'మీ స్పీడ్ అందుకోలేక వంగిపోతున్నాను సార్' అంటాడు ఇతను ఇంకొంచెం వంగి. మళ్లీ ఫట్ మని కొట్టబోతాడు అతను. 'నత్త తో కలిసి నడిచినా, నువ్వు వంగే నడుస్తావ్' అంటాడు. ఆ రోజు కూడా ముందు అతని ఇతని పిలిచాడు.' ఓయ్' అని. ఇద్దరు కలుసుకున్నారు. ఇద్దరూ కలిసి నడుస్తున్నారు. చాలాసార్లు మొదట అతనే ఇతన్ని చూస్తాడు. 'ఓయ్' అని పిలిచాక, కలుసుకున్నాక, మొదట అతనే మాట్లాడటం మొదలుపెడతాడు. కానీ ఆరోజు మాట్లాడలేదు! అతని మాట్లాడకపోవడం ఇతనికి వెలితిగా ఉంది. అతను బాగా చిక్కిపోయి ఉండటం కూడా ఇతను గమనించాడు. కొంచెం సేపు మౌనంగా నడిచాక ఇతనే అడిగాడు.." కనిపించడం లేదేంటి సార్" అని. అతనేం సమాధానం చెప్పలేదు. చెప్పకపోవడం మాత్రమే కాదు, సంబంధం లేని మాట ఒకటి అన్నాడు. " నా కూతురు అంటే నాకు ప్రాణం". చప్పున ఇతను అతన్ని చూశాడు. మాట్లాడుతున్నప్పుడు మొదటిసారి ఇతను అతని వైపు చూసాను. తాకి వెళ్ళిన ఏ దూరపు కాంతికో అతని కళ్ళలో తడి తలుక్కుమంది. " ఏమైంది సార్" అతని చెయ్యి పట్టుకున్నాడు ఇతను. మొదటిసారి ఇతను అతని చెయ్యి పట్టుకున్నాడు! ఇతనికి అతని గురించి కొంత తెలుసు. అతనే ఆ కొంత ను ఇతనికి చెప్పాడు. చెప్పాలని చెప్పలేదు. నడుస్తూ ఉన్నప్పుడు మాటల్లో చెప్పాడు. 

                           తనికి ఒకే ఒక కూతురు. బీటెక్ చేస్తోంది. భర్త, భార్య, కూతురు.. ఇంట్లో ఆ ముగ్గురే ఉంటారు. కూతురే అతని లోకం. కూతురే అతని సంతోషం. కూతురే అతని ఊపిరి. అతనికి కూతురు పుట్టినట్లు ఉండదు. అతనే కూతురికి పుట్టినట్లు ఉంటాడు. నా తల్లి.. నా తల్లి అంటుంటాడు. అంతవరకు ఇతనికి తెలుసు. " ఏమైంది సార్? మీ అమ్మాయి బాగుందా?" అడిగాడు. " బాగుంది. పెళ్లయింది. నెలైంది. మంచి సంబంధం. మంచివాడు. మంచి జీతం. మంచి కుటుంబం" " మరేమైంది సార్?" అన్నాడు ఇతను. " ఏం కాలేదు" అన్నాడు అతను. " ఎందుకని మీరు అలా ఉన్నారు?" అన్నాడు ఇతను. " ఏం లేదు" అన్నాడు అతను. మళ్లీ మౌనపు నడక. వాహనం ఒకటి అతనికి బాగా దగ్గరగా రయ్యిన వెళ్ళిపోయింది. ఎప్పటిలా అతను 'జాగ్రత్త' అని ఇతన్ని దగ్గరికి లాక్కోలేదు. ఎప్పటిలా అతను వేగంగా కూడా నడవడం లేదు. మరి కొంచెం దూరం నడిస్తే మెయిన్ రోడ్డు మీదనుంచి కుడివైపుకు అతను వెళ్లే దారి వస్తుంది. తర్వాత కొంత దూరం నడిస్తే ఎడమవైపుకు ఇతని వెళ్లే దారి వస్తుంది. మధ్యలో కూడలి వస్తుంది. " నా కూతుర్ని చూడకుండా ఉండలేకపోతున్నాను. అన్నం కూడా తినబుద్ధి కావడంలేదు." అకస్మాత్తుగా అన్నాడు అతను. " తను సంతోషంగానే ఉంది కదా సార్" అన్నాడు ఇతను. " ఉంది" అన్నాడు అతను. " మరేంటి సార్" అన్నాడు ఇతను. " ఇన్ని రోజులు తన లేకుండా ఎప్పుడు లేను. ఎప్పుడుా లేను.." అనుకుంటూ.. కుడివైపు దారిలోకి మెల్లగా నడుచుకుంటూ వెళ్లి పోయాడు అతను. 

                           వెళ్లేటప్పుడు ఎప్పటిలా..' ఓయ్ పోతున్నా..' అని కూడా అనలేదు! ఇతను కాసేపు అక్కడే నిలబడి పోయి, తిరిగి నడవడం మొదలు పెట్టాడు. రెండు నిమిషాల తర్వాత కూడలి వచ్చింది. కుాడలిని దాటుకొని వెళ్ళబోతూ ఒక క్షణం ఆగాడు ఇతను. కూడలి మధ్యలో.. పేర్చిన రాళ్ల మధ్య నిలబెట్టిన వెదురు కర్రకు.. బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ ఫోటో అంటించిన అట్టముక్క ఉంది. మసక వెలుతురు లో దగ్గరకు వెళ్లి ఆ ఫోటోలో ఉంది ఎవరా అని చూశాను. అతను!! ఫోటోలో ఉన్నది అతనే! ఫోటో కింద పేరు రాసి ఉంది. డేట్ వేసి వుంది. ఆ డేట్.. ఆ రోజుదే! అచేతనడయ్యాడు ఇతను. అతని పేరేమిటో చూద్దాం అనుకున్నాడు. చూడకుండానే ముందుకు వెళ్ళిపోయాడు. దేవుళ్ళకు పేర్లేమిటో.. 'దేవుడు' అంటే సరిపోదా అని అనిపించినట్లే.. అతనిలాంటివాళ్లను చూసినప్పుడు అనిపిస్తుంది.. మనుషులకు పేర్లేమిటో 'మనిషి' అంటే సరిపోదా! అని.

కూతురు కూతురు Reviewed by Smartbyte group on August 28, 2018 Rating: 5

No comments: