దెయ్యాల్లేవ్ గేయాల్లేవ్!


                   ఆ చీకట్లో వాళ్లకు అలా చూస్తే దెయ్యాలు ఉన్నాయని అనుకుంటారు ఎవరైనా. ఇద్దరు మనుషులు వాళ్లు! ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు. వాళ్ల మధ్యలో ఖరీదైన గుండ్రటి చెక్కబల్ల ఉంది. ఆ బల్లమీద ఖరీదైన మద్యం సీసా ఉంది. ఉండడానకైతే ఉంది. ఆ అందరూ తాగడం లేదు. ఆ ఇద్దరికీ తాగే అలవాటు లేదు. చీకట్లో చాలాసేపటి గా చలనం లేకుండా గడ్డకట్టుకు పోతున్నట్లు రెండు పొడవాటి చెట్ల మధ్య.. వాళ్లని మనుషులుగా పోల్చుకోవడం ఎంతటి ధైర్యవంతుడైన కష్టమే. పైగా వాళ్లు తక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఎక్కువగా ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు.. కలర్ టీవీలు అప్పుడప్పుడే అందుబాటులోకి వస్తున్న కాలం నాటి క్షుద్ర రచయిత. ఇంకొకరు 'ఘెారై' అనే పెన్న నేమ్ తో హాబీగా దెయ్యాల కథలు రాస్తూ, దెయ్యాలు లేవని నిరూపించడానికి ట్రై చేస్తున్న ప్రస్తుత రచయిత. ఘెారై అంటే ఘోస్ట్ రైటర్. " దెయ్యాలు లేవని నిరూపించడానికి నువ్వెవరు? ఆ పని చేయడానికి విజ్ఞాన వేదిక వాళ్ళో, అజ్ఞాన దీపిక వాళ్ళో ఉంటారు కదా" అన్నాడు క్షుర.. చాలాసేపు ఘెారై చెప్పింది విన్నాక. అప్పటికే నడిరాత్రి దాటింది. " అది నా ధర్మం అనుకున్నాను సార్" అన్నాడు ఘెారై. " పౌరుడిగా.. పాటించడానికి, అవలంబించడానికి, అనుసరించడానికి పౌర సమాజంలో ఇంకా అనేక ధర్మాలు ఉంటాయి.

                              నువ్వు దెయ్యాలనే ఎందుకు పట్టుకున్నావు.?" అడిగాడు క్షుర. అతడి వృద్ధాప్యపు దవడ చలికి వణుకుతుంది. పాటించడం, అనుసరించడం, అవలంబించడం.. ఎలా ఉండే భాష ఎలా అయిపోయింది సార్.. మీది! మీ దెయ్యాల కథలు చదివి వణికి చచ్చిన జనరేషన్ మాది. మీ మాట ఎంత షార్ప్ గా ఉండేది! సెవెన్ కాలుతున్నప్పుడు పుర్రె 'టప్' మనీ పేలినట్లు ఉండేది. అదంతా ఏమైపోయింది సార్. అందుకే ఏడుపొచ్చింది" అన్నాడు  ఘెారై. " అవన్నీ గుర్తు చెయ్యకు. ఎందుకు వచ్చావ్ చెప్పు" అన్నాడు క్షుర విసుగ్గా. క్షుర హర్ట్ అయ్యాడని ఘెారైకి అర్థమైంది. తన కథల్లో దెయ్యాన్ని కూడా చాలాసార్లు హర్ట్ చేశాడు ఘెారై. పాఠకులకు ధైర్యం చెప్పడానికి అతడి చేసిన ఘాతుకం అది. అతని కథల్లో ఒక్కచోటేనా 'దెయ్యాల్లేవ్ గియ్యాల్లేవ్' అనే మాట ఉంటుంది. ఆ మాట టెంపరరీగా మనుషులకు దైర్యం తెప్పించినా, దెయ్యాలకు పర్మినెంట్ గా హార్ట్ చేస్తుందేమోనన్న ఆలోచన అతడికేప్పుడు కలగలేదు. " ఏంటి నీ సమస్య?" అడిగాడు క్షుర. " నన్ను రాయొద్దంటున్నారు సార్" అన్నాడు ఘెారై. " ఏం రాయొద్దంటున్నారు? ఎవరు రాయొద్దంటున్నారు?" " దెయ్యాల కథల్ని. పాఠకులు" " ఎందుకట?" అడిగాడు క్షుర. " పిల్లలు భయపడుతున్నారట". " మంచిదే కదా. పిల్లలు ఎవరో ఒకరికి భయపడాలి. తల్లిదండ్రులకు భయపడటంలేదు. దెయ్యం భయమైనా లేకపోతే ఎలా? వాళ్ళు ఎలా మంచి పౌరుల్లా ఎదుగుతారు?" అన్నాడు క్షుర. ఘెారై మనసు మళ్ళీ చివుక్కుమంది. తన గురు సమానుడైన క్షుర నోటి నుంచి 'మంచి పౌరుల్లా ఎదగడం' అనే దైవ భాష దిగుమతి అయినందుకు కలిగిన బాధ అది. " కానీ సార్.. దెయ్యాలు ఉన్నాయని రాసి నేను పిల్లల్ని భయపెట్టడం లేదు. దెయ్యాలు లేవని రాసి పిల్లల్ని ధైర్యవంతుని చేస్తున్నాను" అన్నాడు. " పిల్లలకు భయమే లేనప్పుడు వాళ్లకు ధైర్యం ఎందుకు చెప్పాలి?" అన్నాడు క్షుర. " అంటే.. సార్, ముందు భయపెట్టి, తర్వాత ధైర్యం చెబుతాను. అది నా స్టైల్ ఆఫ్ రైటింగ్" అన్నాడు ఘెారై.. చేతులు నలుపుకుంటూ. ఘెారై వైపు తీక్షణంగా చూశాడు క్షుర. 

                                 " మరి పాఠకులకు వచ్చిన ప్రాబ్లం ఏంటి?" అన్నాడు. " దెయ్యాలు ఉంటే ఉన్నాయని చెప్పాలి కానీ, లేనప్పుడు లేవని చెప్పడం ఎందుకు అంటున్నారు సార్" " నిజమే కదా" అన్నాడు క్షుర. " అసలు ఈ పాఠకులకు ఏం కావాలి సార్. పిచ్చి పట్టిపోతుంది నాకు. రాసింది వద్దంటారు. రాయంది కావాలంటారు! చచ్చి, దెయ్యమై పిల్లల్ని తప్ప మిగతా ఇంటిల్లపాదినీ పీక్కుతినాలన్నంత కోపం వస్తుంది సార్" అన్నాడు ఘెారై. అతడి ఆవేదనను గమనించాడు క్షుర. " ఐ కెన్ అండర్ స్టాండ్. ప్రతి దెయ్యాల రచయితకీ ఉండే ప్రాబ్లమే ఇది" అన్నాడు. ఇద్దరూ చాలాసేపు మౌనంగా ఉన్నారు. 'ఏం చేయమంటారు సార్' అన్నట్లు చూస్తున్నాడు ఘెారై. క్షుర అతడికి ఏమీ చెప్పలేకపోయాడు.ముప్ఫై ఏళ్ల క్రితం తనకోచ్చిన సమస్యే ఇప్పుడీ వర్తమాన రచయితకి వచ్చింది. " రాస్తే ఏమోవుతుందట?" అడిగాడు ఘెారైని. " చంపేస్తారట సార్. బెదిరిస్తున్నారు" " రాయడం మానేస్తే ఏమవుతుంది?" " చచ్చిపోతాను సార్. రాయకుండా ఉండలేను". నిట్టూర్పు విడిచాడు క్షుర. " టేబుల్ మీద ఉన్న ఈ బాటిల్ చూసావా? ఫుల్ బాటిల్. పక్కనే సోడా, గ్లాసులు. తాగడం నాకు ఇష్టం. కానీ మానేశాను. ఇరవై ఏళ్ల క్రితం క్షుద్ర కథలు రాయడం మానేసిన రోజు నేరుగా వైన్ షాప్ కు వెళ్లి, కొనితెచ్చుకున్న బాటిల్ ఇది. అప్పట్నుంచి కథ రాయలేదు, ఆ బాటిల్ ఓపెన్ చేయలేదు. ఎప్పుడైనా మనసు పీకుతోంది. ఒక దెయ్యం కథైనా రాయాలని. రాయకుండా ఉండడం కోసం వెంటనే బాటిల్ బయటకు తీస్తాను. ఈ బాటిల్ లో నీకు మందు కనిపిస్తుంది కదా. నాకు దెయ్యం కనిపిస్తుంది. దెయ్యం కథ రాయాలన్న నా కోరికను దెయ్యంలా ఈ సీసాలో బందించాను నేను".. మరోసారి నిట్టూర్పు విడిచాడు క్షుర. ఘెారై ఆ బాటిల్ వైపు చూశాడు. 'ముాత తెరవండీ.. మూత తెరవండీ' అని బాటిల్ లోపల్నుంచి ఎవరో రోదిస్తున్నట్లుగా అనిపించింది. క్షుర వైపు చూశాడు. అతడి కళ్ళు చెమ్మగిల్లి ఉన్నాయి. " ఈ పాఠకులు మనుషులు కాదా సార్" అని పైకి లేచాడు. " పాఠకులను అనకు. మనమే మనుషులం కాదు" అని క్షుర కూడా పైకి లేచాడు. ఇద్దరూ పైకి లేచిన రెండు క్షణాలకు, అప్పటివరకు శిలల్లా బిగుసుకుపోయి ఉన్న ఆ రెండు పొడవాటి చెట్లుా ఊగడం మొదలుపెట్టాయి.

దెయ్యాల్లేవ్ గేయాల్లేవ్! దెయ్యాల్లేవ్ గేయాల్లేవ్! Reviewed by Smartbyte group on August 23, 2018 Rating: 5

No comments: