అసలు బంగారం

                        రామాపురంలో రాజయ్య అనే రైతు ఉండేవాడు. అతడికి నలుగురు కొడుకులు, వాళ్ళు పరమ బధ్ధకస్తులు. కష్టపడకుండానే డబ్బు రావాలని కోరుకునేవాళ్ళు. వాళ్ళని మార్చాలని ఎంత ప్రయత్నించినా రాజయ్య వల్ల కాలేదు. కొన్నాళ్ళకు వృద్ధాప్యం కారణంగా రాజయ్య మంచాన పడ్డాడు. తాను ఎంతో కాలం
బతకనని రాజయ్యకు అర్ధమైంది. కొడుకుల్లో మార్పు తెచ్చేందుకు చివరగా ఒక ఉపాయం ఆలోచించాడు. ఓ రోజు నలుగురు కొడుకుల్నీ పిలిపించాడు. 'చూడండి అబ్బాయిలూ.... నేను ఇంక ఎక్కువ రోజులు బతకను, నేను కష్టపడి సంపాదించిన బంగారాన్ని ఒక పెద్ద పెట్టెలో ఉంచాను. దాన్ని మన పొలంలోనే ఓ చోట దాచాను. కానీ, ఎక్కడ దాచానో నాకు
గుర్తుకు రావడం లేదు. మీరే వెతికి తీసి ఆ బంగారాన్ని సమానంగా పంచుకోండి' అని చెప్పాడు.
                 బంగారం ఉన్న ఆ పెట్టెను ఎలా తీయాలా అని నలుగురూ ఆలోచించారు. అందుకు పొలం దున్నడం ఒక్కటే మార్గమని నిర్ణయించుకున్నారు. పది రోజులు బాగా దున్నారు. ఎక్కడా పెట్టె జాడ కనిపించలేదు. తండ్రి వద్దకు వెళ్ళి పెట్టె కంపించలేదని చెప్పారు. నేను ఇంకాస్త జాగ్రత్తగా గుర్తు తెచ్చుకుంటాను.ఎలాగూ పొలం దున్నారు కాబట్టి నాట్లు కూడా వేయండి అన్నాడు రాజయ్య. తండ్రి చెప్పినట్టుగానే పొలంలో నాట్లు వేశారు. పొలం గట్టు కూడా తవ్వి చూశారు. అయినా పెట్టె దొరకలేదు. మళ్ళీ తండ్రి చెప్పినట్టే పొలానికి నీళ్ళు పెట్టారు. కొంతకాలం ఆగాక తండ్రిని అడిగితే'ఒక్క ఆరు నెలలు ఆగండి' అన్నాడు.
                  ఏడాది వారి పొలం బాగా పండింది. తాను కూడా ఎప్పుడూ పండించలేనన్ని ధాన్యం బస్తాలు ఇంటికి రావడంతో రాజయ్య ఆశ్చర్యపోయాడు. తన కొడుకులతో'బంగారం ఇంటికి వచ్చేసిందే' అన్నాడు. విషయం అర్ధంకాక కొడుకులు రాజయ్యవైపు చూశారు. అప్పుడు రాజయ్య 'కలసి కష్టపడితే ఫలితం ఎలా ఉంటుందో మీరే చూశారుగా,నేను ఏ బంగారాన్ని దాచలేదు. మీలోమార్పు రావాలనే ఈ అబధ్ధం చెప్పాను. ఏడాదిపాటు కష్టపడి బంగారంలాంటి పంటను ఇంటికి తెచ్చారు' అని నలుగురినీ మెచ్చుకున్నాడు. తండ్రి ఆంతర్యాన్ని అర్ధం చేసుకున్న నలుగురు కొడుకులూ అప్పటినుంచీ కష్టపడి పనిచేయడం మొదలుపెట్టారు.
అసలు బంగారం అసలు బంగారం Reviewed by Smartbyte group on July 06, 2016 Rating: 5

No comments: