వీరయ్య, సీతయ్య అన్నదమ్ములు. సీతయ్య పేదవాడు. పండగ వచ్చిందంటే వీరయ్య ఇంట్లోవాళ్ళంతా కొత్త బట్టలతో కళకళలాడేవారు. సీతయ్య ఇంట్లో మాత్రం పండగ కూడా సాదాసీదాగా గడిచి పోయేది. ఓ పండక్కి అయితే ఇంట్లో వంట చేసుకోలేదు. పిల్లల పరిస్థితిని చూసి పండగ ఖర్చులకోసం అన్నను డబ్బు సాయం అడిగాడు సీతయ్య. ఇంటికి వచ్చిన తమ్ముణ్ని వీరయ్య హేళనగా మాట్లాడి పంపేసాడు. దాంతో సీతయ్య ఓ చెట్టు కింద దిగాలుగా కూర్చున్నాడు.
సీతయ్యను పేదరాశి పెద్దమ్మ చూసి 'ఏంటి బాబూ దిగులుగా కూర్చున్నావు' అని అడిగింది. సీతయ్య జరిగిందంతా చెప్పాడు. పెద్దమ్మ సీతయ్యను తనతోపాటు తీసుకెళ్ళి తన ఇంట్లో ఉన్న ఓ తిరగలిని అతడికి ఇచ్చి.... 'దీని ముందు నిలబడి నువ్వు ఏదైనా కోరుకుంటే అది వచ్చేస్తుంది. ఇచ్చినవి చాలనిపించగానే ఓ ఎర్రటి గుడ్డను దీనిపైన కప్పిపెట్టు' అని చెప్పింది. సీతయ్య ఎంతో సంతోషంగా ఆ తిరగలిని తీసుకుని ఇంటికి వచ్చి కావల్సినవన్నీ కోరుకున్నాడు. తర్వాత దానిపై ఎర్ర గుడ్డను కప్పాడు. దాంతో అతడి భార్యాపిల్లలు ఎంతో సంతోషించారు. అప్పట్నుంచి తిరగలి ద్వారా వచ్చిన వాటిని మార్కెట్లో అమ్మి తన అవసరాలు తీర్చుకునేవాడు.సీతయ్య ధనవంతుడవడం చూసి, వీరయ్యకు తమ్ముడిపై ఈర్ష్య కలిగింది.
సీతయ్య సంపాదన రహస్యం తిరగలి అని పసిగట్టి, ఓరోజు దాన్ని దొంగిలించాడు. దాన్ని తీసుకొని నగరం వదిలిపోవడానికి రాత్రికిరాత్రే పడవలో ప్రయాణమయ్యాడు. పడవలో తిరగలి పనితనాన్ని పరీక్షించాలనుకున్నాడు వీరయ్య.దాని ముందు నిలబడి 'నాకు బంగారం కావాలి' అని కోరాడు. అంతే, వెంటనే దాన్నుంచి బంగారం వచ్చింది. కాసేపటికి గుట్టలుగుట్టలుగా పోగయ్యింది. అయితే వీరయ్యకు దాన్ని ఎలా ఆపాలో తెలియలేదు. దాంతో బరువెక్కువై నడి సముద్రంలో పడవ మునగసాగింది.పడవలోని బంగారంతోపాటు వీరయ్య కూడా మునిగిపోయాడు.
దురాశ
Reviewed by Smartbyte group
on
July 07, 2016
Rating:

No comments: