చెట్టు చెప్పిన గుట్టు!

                 తడి పేరెందుకు లెండి, చెప్పుకుంటే సిగ్గుచేటు. అందరిలాంటి మనిషే. కాకపోతే అతని కధ తెలుసుకుంటే మన కధ బాగుంటుంది.అతగాడికి ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి ముందు గున్నమామిడి చెట్టు ఉంది. దాని కొమ్మ మీద పక్షులు గూడు కట్టుకున్నాయి. అది చూసి అతడికి కోపం వచ్చింది. 'నా చెట్టు మీద
వాటి కాపురమా? 'అనుకుని గూడున్న కొమ్మని నరికేశాడు. 'అయ్యో పాపం...' అన్నారంతా. అతడు
వినలేదు. మరో కొమ్మ పక్కింటి ముందుకి పాకి నీడనిస్తుంది. అతడు అది చూసి, 'నా చెట్టు నీడతో
వాళ్ళకి చల్లదనమా?' అనుకుని ఆ కొమ్మని కొట్టేశాడు.
                 'అయ్యో పాపం ...' అన్నారంతా. అతడు వినలేదు. ఉగాదికి మామిడి పూత పూసి
నెల తిరిగేసరికి పిందెలు వేసి గుత్తులుగుత్తులుగా కాయలు కాశాయి. పిల్లలు చెట్టు కింద  చేరి రాలిన
పిందెలు ఏరుకున్నారు. కొందరు చెట్టూ కాయలు కూడా కోశారు. అది చూసి అతడు, 'నా చెట్టు కాయలు వాళ్ళు తింటారా?' అనుకుని కొమ్మలన్నీ విరిచేశాడు.
                 'అయ్యో పాపం ...' అన్నారంతా. అతడు వినలేదు. కొమ్మలు లేని చెట్టు మొండిగా మిగిలింది. వర్షాలు పడగానే మోడు చివుళ్ళు వేసింది. ఆ ఆకుల్ని అందుకుని కొందరు తోరణాలు కట్టుకున్నారు. అతడు అది చూసి,'నా చెట్టు ఆకులు వాళ్ళ గుమ్మాలకా?' అనుకుని చెట్టుని మొదలంటా కోయించేసి, ఆ కలపతో బల్లలు చేసి అరుగు మీద వేయించాడు.
                  'అయ్యో పాపం ...' అన్నారంతా. అతడు వినలేదు.
                  దారినపోయేవారు ఆ బల్లల మీద కూర్చొవడం చూసి అతడికి నచ్చలేదు. వెంటనే
అగ్గి రాజేసి ఆ బల్లల్ని తగలబెట్టేశాడు. బూడిద మిగిలింది.
                   'అయ్యో పాపం ...' అన్నారంతా. అతడు వినలేదు.
                   ర్నాడు ఆ బూడిదను ఇరుగూపొరుగూ అంట్లు తోమడానికి తీసుకెళ్ళడం చూశాడు.
కోపంగా బిందెడు నీళ్ళు తెచ్చి బూడిదపై కుమ్మరించాడు. అంతా బురదయిపొయింది. రుసరుసలాడుతూ
ఇంట్లోకి నడవబోయాడు. కాలు జారి జర్రున కింద పడ్డాడు. నడుం విరిగింది. 'అయ్యో పాపం' అంటూ
అందరూ అతడిని ఇంట్లోకి సాయం పట్టారు. అతడికి నీడ నివ్వడానికి చెట్టు లేదు. తినడానికి కాయలేదు.
కూర్చోడానికి బల్ల లేదు. ఎవరికీ వద్దనుకున్నవన్నీ అతడికే లేకుండా పోయాయి.

చెట్టు చెప్పిన గుట్టు! చెట్టు చెప్పిన గుట్టు! Reviewed by Smartbyte group on July 08, 2016 Rating: 5

No comments: