పూర్వం ఒక రాజు వుండేవాడు. ఆయన చాలా ఐశ్వర్యవంతుడు, బలవంతుడూ. కానీ,
ఆయన తన ప్రజల యోగక్షేమాల గురించి పట్టించుకునేవాడు కాదు.
కొన్నాళ్ళకు అతనికి జబ్బు చేసింది. దీంతో విచారగ్రస్థుడైన ఆ రాజు ఆ జబ్బు నుంచి త్వరగా కోలుకోవాలనుకున్నాడు. ఎంతోమంది సుప్రసిధ్ధ వైద్యులు వచ్చి అతణ్ణి పరీక్షించారు. కానీ, ఎవరూ నయం చేయలేకపోయారు. రాజుకు కోపం వచ్చి వాళ్ళందరినీ కారాగారంలో బంధించాడు.
అలా ఉండగా వేరే దేశం నుంచి ఇద్దరు ఘన వైద్యులు వచ్చారు ఆయనకు చికిత్స
చేయడానికి. మొదటి వైద్యుడు రాజును పరీక్షించాడు. అతడు అంతగా తెలివితేటలు లేని వాడు.
"అయ్యా! మీకు జబ్బు లేదు. మీ ఆరోగ్యం దివ్యంగా ఉంది. లేని జబ్బు ఉన్నాట్టుగా ఊహించుకుని అనవసరంగా బాధపడుతున్నారు" అని ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. రాజుకి కోపం వచ్చి అతణ్ణి చీకటి కొట్లో వేయించాడు. అదంతా చూసిన రెండో వైద్యుడు రాజుగారిని రకరకాలుగా పరీక్షించి,"అయ్యా మీదొక వింత వ్యాధి. నిత్యం సంతోషంగా ఉండే వ్యక్తి పాదరక్షలు ధరిస్తే వెంటనే తగ్గిపోతుంది" అన్నాడు తెలివిగా.
రాజు సంతోషించి అతనికి ఒక సంచినిండా బంగారం కానుకగా ఇప్పించాడు. ఆ తర్వాత తన భటులకు "ఆ నిత్య సంతోషిని పట్టుకుని రండి" అని నలుమూలలా పంపిచాడు. వాళ్ళు వెతకగా,వెతకగా ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండే ఒక బిచ్చగాడు కనిపించాడు. ఉన్న ఫలంగా అతణ్ణి రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళారు భటులు. "దయచేసి నీ చెప్పులు నాకివ్వు దానికి బదులుగా నువ్వు కోరింది ఇస్తా" అనాడు రాజు.
అందుకు బిచ్చగాడు "అయ్యా! నాకు నాదంటూ ఏదీ లేకపోవడం వల్లే నిత్యం సంతోషంగా ఉండగలుగుతున్నా, నాకు చెప్పులు కూడా లేవు " అన్నాడు నవ్వుతూ.
నిత్య సంతోషి
Reviewed by Smartbyte group
on
July 07, 2016
Rating:

No comments: