ఆ అరుపు విని పరుగో పరుగు!
దెయ్యాలు ఉంటాయా? ఉండడం ఏమిటి? మనల్ని పేరు పెట్టి కూడా పిలుస్తాయని
నమ్ముతారు మా ప్రాంతం లోని కొందరు గిరిజనులు. వాళ్ళు తరచుగా ఈ సంఘటన
గురించి చెబుతుంటారు. ఒక రోజు తట్టయ్య అనే వ్యక్తి నారాయణగూడ దగ్గర సారా
తాగడానికి వెళ్ళాడు.
బాగా తాగి, ఊగుతూ జోగుతూ ఇంటికి వస్తుండగా ' తట్టయ్య ' అనే కేక వినిపించింది.వెనక్కి చూస్తే... ఎవరూ లేరు.
కొద్ది సేపటి తరువాత 'తట్టీ' అని గట్టిగా ఎవరో పిలిచారు.ఇప్పుడు కూడా ఎవరూ కనిపించలేదు.ఈ దెబ్బతో తట్టయ్యకు ఒక్కసారిగా మత్తు దిగింది.
తనను చంపడానికి డోంగ్రీ దెయ్యం వస్తోందని గ్రహించాడు!
తట్టయ్య చేతిలో ఎప్పుడూ ఒక కర్ర ఉంటుంది.రాత్రి పూట ఏ పామో కరవకుండా ముందుజాగ్రత్తగా ఆ కర్రను వాడతాడు.
' త..ట్ట..య్య ' అని ఏదో అరుస్తూ తన దగ్గరకు వచ్చినట్లు అనిపించింది అతనికి.ఇక తన పని అయిపోయిందని అనుకున్నాడు.ఒక్కసారిగా తన చేతిలో ఉన్న కర్రతో గట్టిగా గాలిలో కొట్టాడు. ' దబ్ ' మన్న శబ్ధం తో పాటు ఎవరో కిందపడినట్లు అనిపించింది.ఏం పడిందో తెలియదు.చూసే ధైర్యం, ఓపిక ...రెండూ లేవు.వెనక్కి తిరిగి చూడకుండా పరుగో పరుగు!
మనుషుల్లో రకాలు ఉన్నట్లు దెయ్యాల్లోనూ రకాలుంటాయట.
అందులో పేరు పెట్టి పిలిచే దెయ్యాలు యమడేంజరట.మూడుసార్లు పేరు పెట్టి పిలుస్తాయట.
మొదటి రెండుసార్లు ఏమీ కాదట గానీ మూడో సారి పిలిచినప్పుడు పలకకపోతే వెనుక
నుంచి వచ్చి చావబాదుతాయట.అందుకే మూడోసారి తన పేరు వినబడకుండా వెనక్కి
చూడకుండా పరుగెత్తాడు. ఈ సంఘటన నిజంగా జరిగిందా? లేక తాగిన మత్తులో ఏవేవో
ఊహించుకున్నాడా? లేక ఎవరైనా ఆకతాయిలు ఆటపట్టించారా? అనేది తెలియదు గానీ,
పేరు పెట్టి పిలిచే దెయ్యాల ప్రస్తావన వచ్చినప్పుడల్లా తట్టయ్య గురించి చెప్పుకుంటారు.
Please comment on this post
ఆ అరుపు విని పరుగో పరుగు!
Reviewed by Smartbyte group
on
June 09, 2014
Rating:

No comments: