" కాంతం, నాకు చాతిలో నొప్పిగా
అనిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్లాను. ఈసీజీ, స్కానింగ్, బ్లడ్ టెస్ట్ లు
చేయాలన్నాడు. దానికో రెండువేలుకావాలి, ఇస్తావా?" భార్యని వేడుకుంటూ అడిగాడు
రాంబాబు. " మీకున్న నొప్పి ఏమిటో నాకు బాగా తెలుసు. ఒకరోజు తాగకపోతే మీకు
ఒళ్లంతా నొప్పులోస్తాయి. అయినా ప్రతి దానికి భార్య ముందు చేయించడానికి మీకు సిగ్గు
లేదుా? ఇకనుంచి దేనికి డబ్బు అడక్కండి. ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుని మీ అవసరాలు మీరే
తీర్చుకోండి. నిష్టూరంగా అనేసి వంటింట్లోకి వెళ్ళిపోయింది కాంత. భార్య ధోరణి చూసి
రాంబాబు కి కడుపు మండింది. అప్పటికప్పుడే ఆమె గొంతు పిసికి చంపేయాలన్నంత కోపం
వచ్చింది. కానీ గత్యంతరం లేక కోపాన్ని దిగమింగుకున్నాడు. ఏడాది క్రితం
ఉద్యోగంలోంచి డిస్మిస్ అయ్యేవరకు రాంబాబు రాజాలా బతికాడు. పోలీస్ ఇన్ స్పెక్టర్ గా
ఉద్యోగం చేస్తూ రెండుచేతులా సంపాదించే వాడు. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టేవాడు.
రోజు రాత్రి మందు కొట్టేవాడు. ఇంట్లో అందమైన భార్య ఉన్న కొత్తదనం కోసం బయట కాల్
గర్ల్స్ తో మజా చేసేవాడు. కానీ ఏడాది
క్రితం లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడి పోగొట్టుకున్నాడు. అప్పటి నుంచి అతని
విలాసాలకు బ్రేక్ పడింది. కానీ అలవాటుపడిన ప్రాణం ఎలా ఊరుకుంటుంది? విలాసాల కోసం
కొన్నాళ్లు అప్పులు చేశాడు. తర్వాత అప్పు పుట్టకపోవడంతో భార్య ముందు చెయ్యి
చాపాడు. కాంతం తల్లిదండ్రులు రెండేళ్ల క్రితం కారు ప్రమాదంలో మరణించారు. కాంతం కి
తోబుట్టు ఎవరూ లేకపోవడంతో తండ్రి యావదాస్తి ఆమెకే వచ్చింది. భర్త ఉద్యోగం పోయాక
ఇంటికి ఖర్చులన్నీ తనే భరిస్తుంది. అప్పుడప్పుడు రాంబాబు జేబు ఖర్చుల కూడా కొంత
డబ్బు ఇస్తుంది. కానీ అతని విలాసాలకు చిల్లిగవ్వ ఇవ్వడం లేదు. ఏదైనా ఉద్యోగం చేసి
సంపాదించుకుంటుంది. కానీ అవినీతి ముద్రపడిన రాంబాబుకి ఉద్యోగం ఎవరిస్తారు?
వ్యాపారం చేయాలన్నా దానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. సవాలక్ష దురలవాట్లు
ఉన్న భర్త కోసం పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం కాంతం కి ఇష్టం లేదు. అదే కారణం
వల్ల రాంబాబు భార్యపై ద్వేషం పెంచుకున్నాడు. తన సమస్యలన్నీ తీరాలంటే కాంతం ని
అడ్డు తొలగించుకోవటమెుక్కటే మార్గం అనుకున్నాడు. కాంతం చచ్చిపోతే ఆమె పేరిట ఉన్న
ఆస్తిపాస్తులన్నీ తనకోచ్చేస్తాయి. అప్పుడు ఉద్యోగం లేకపోయినా జీవితాంతం జల్సాగా
బతకొచ్చు అనుకున్నాడు. ఈ విషయం గురించి బుర్రకి పదునుపెట్టి దీర్ఘంగా ఆలోచించాడు.
తన సర్వీస్ లొ చూసిన రకరకాల కేసుల్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. మొత్తానికి భార్యని
చంపడానికి నాలుగు మార్గాలు కనిపించాయి రాంబాబు కి. 1. అనారోగ్యం, 2. ప్రమాదం, 3.
ఆత్మహత్య, 4. హత్య!
తొలి
ప్రయోగం ఏమిటంటే విషప్రయోగంతో చంపి దాని గుండెపోటు మరణంగా చూపాలి. కానీ కాంతం వయసు
ముప్పైఐదేళ్లే! ఇంత చిన్నవయసులోనే ఆమెకు ఎటాక్ వచ్చింది అంటే ఎవరు నమ్మరు గనుక ఆ
ఆలోచన విరమించుకున్నాడు రాంబాబు. కాంతం ని కరెంట్ తో లేదా గ్యాస్ సిలిండర్ పేల్చడం
ద్వారా హతమార్చి దాని ప్రమాదంగా చిత్రించడం రెండో పద్ధతి. కానీ ఆమె చావకుండా
గాయాలతో బయటపడితే తన గుట్టురట్టు అవుతుందని భయపడ్డాడు. ఇక మూడో ప్లాన్ ప్రకారం
కాంతం చేసే అధిక మోతాదులో బలవంతంగా నిద్రమాత్రలు మింగిన చంపి దాన్ని ఆత్మహత్యగా
చూపించాలి. కానీ కాంతం కి ఆత్మహత్య చేసుకోవాల్సినన్ని తీవ్ర సమస్యలేం లేవు.
అందువల్ల పోలీసులు అతన్ని అనుమానించవచ్చు. అందుకే ఆ ప్రయత్నం కూడా మానుకున్నాడు.
ఇక నాలుగో ప్లాన్ ప్రకారం భార్యను 'హత్య' చెయ్యడం ఒక్కటే సరైన మార్గం అనుకున్నాడు
రాంబాబు. తన ఊర్లో లేనప్పుడు అర్ధరాత్రిపూట తను ఇంట్లో దూరిన దొంగ ఒంటరిగా ఉన్న
కాంతాన్ని చంపి దోపిడీ చేసి పారిపోతాడు. ఇలా జరిగితే తనని పోలీసులు అనుమానించారు.
కాకపోతే ఈ పనికోసం ఒక కిరాయి హంతకుడిని నియమించాల్సి ఉంటుంది. వృత్తిరీత్యా గతంలో
రాంబాబుకి కొందరు కిరాయి హంతకులతో పరిచయముంది. ఇలాంటి హత్యలను వారు చిటికలో
చేయగలరు. కానీ ఈ పనిలో మరొకర్ని వాడుకోవడం రాంబాబుకి ఇష్టం లేదు. కిరాయి హంతకుడు ఏ
చిన్న తప్పు చేసినా తన మెడకు చుట్టుకుంటుంది. ఒకవేళ అతను తప్పు చేయకుండా పని
ముగించిన తర్వాత తనని జీవితాంతం బ్లాక్ మెయిల్ చేయవచ్చు. అందువల్ల ఈ హత్య తనే
చేయాలనుకున్నాడు. కానీ ఒకే సమయంలో ఒక చోట హత్యచేసి మరోచోట తను ఉన్నట్లు 'ఎలిబీ'
ఎలా సృష్టించుకోవాలి? అని చాలాసేపు దీర్ఘంగా ఆలోచించక రాంబాబు రూపుదిద్దుకుంది.
కొద్ది
రోజుల్లో ఆ పథకాన్ని అమలు చేసే అవకాశం కూడా వచ్చింది. ఓ దూరపు బంధువుల పెళ్ళికి
రమ్మని ముంబై నుంచి రాంబాబు దంపతులకు ఆహ్వానం వచ్చింది. కానీ కాంతం తను రాలేనని
చెప్పి భర్తను ఒంటరిగానే వెళ్లమంది. కోరుకున్నది కూడా అదే. అతను హైదరాబాదు నుంచి
ముంబై వెళ్లే చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో ముందే రిజర్వేషన్ చేయించుకుని శనివారం
రాత్రి ట్రైనెక్కాడు. ఆ బోగీలో పెద్దగా జనం లేరు. నగరం దాటగానే రాంబాబు టాయిలెట్
లోకి దూరి తన వేషం మార్చుకున్నాడు. ముఖానికి నకిలీ గడ్డం, మీసాలు తగిలించుకుని
వేరే దుస్తులు, బూట్లు ధరించాడు. విడిచిన బట్టలు సూట్ కేసులో వేసుకున్నాడు. తర్వాత
తన ఫోన్ నీ చేసి ఓ స్టేషన్లో దిగి పోయాడు. అక్కడి నుంచి మరో ట్రైన్లో హైదరాబాద్
తిరిగి వచ్చాడు. ఓ ఆటో ఎక్కి తన ఇంటికి సమీపంలో దిగాడు. అప్పుడు సమయం అర్ధరాత్రి
కావస్తుంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. అతను కాలినడకన తన ఇంటికి
చేరుకున్నాడు. పెరట్లో ఉన్న పెంపుడు కుక్క యజమాని వాసనని గుర్తు పట్టింది. అందుకే
మొరగలేదు. రాంబాబు సూట్ కేసులోంచి విషం బిస్కెట్లు తీసి కుక్కకు తినిపించి దాని
చంపేశాడు. తర్వాత పెరటి వాకిలి తరచి ఇంట్లోకి ప్రవేశించాడు. నెట్టగానే
తెరుచుకునేలా అంతకుముందే అతను పెరటి వాకిలి బోల్టులు లూజుగా చేసి ఉంచాడు. రాంబాబు
ఇంట్లోకి ప్రవేశించాక చప్పుడు కాకుండా బెడ్ రూం దగ్గరికి వెళ్లి లోపలికి తొంగి
చూసాడు. మంచంపైన కాంతం ఆదమరచి నిద్రపోతోంది. చేతులకు గ్లౌజులు ధరించి మంచాన్ని
సమీపించాడు. ఒక తలగడను కాంతం ముఖంపై ఉంచి బలంగా అదిమి పెట్టాడు. ఊపిరాడక కాంతం
కాళ్లు చేతులు కొట్టుకుంది. రాంబాబు పట్టువదల్లేదు. కాసేపట్లో కాంతం లో చలనం
ఆగిపోయింది. రాంబాబు వెంటనే కాంతం వంటిమీద నగలతోపాటు ఇనుప పెట్టి లోని డబ్బు
తీసుకొని తన బ్యాగులొ వేసుకున్నాడు. గదిలో దోపిడి జరిగిన వాతావరణం సృష్టించి
వచ్చిన దారిలోనే ఇంట్లోంచి బయటపడ్డాడు. కనిపించిన ట్యాక్సీ ఎక్కి నేరుగా ఎయిర్
పోర్ట్ కు చేరుకున్నాడు. మారుపేరుతో అంతకుముందే బుక్ చేసిన టిక్కెట్ తొ ముంబై
ఫ్లైట్ ఎక్కాడు. చార్మినార్ ఎక్స్ ప్రెస్ ముంబైకి చేరుకునే సమయానికల్లా ముంబైలో
ఫ్లైట్ దిగాడు. ఎయిర్ పోర్ట్ బయట ఓ నిర్జన ప్రదేశంలో మారువేషం తీసేసి మునుపటి
దుస్తులు ధరించాడు. టాక్సీలో పెళ్లి జరిగే చోటుకు చేరుకున్నాడు. అక్కడ తన సెల్
ఫోన్ స్విచాన్ భార్య నెంబర్ కి డయిల్ చేశాడు. అతనూహించినట్లే ఎవరు ఫోన్ లిఫ్ట్
చేయలేదు. ఆ తరువాత అంతా రాంబాబు అనుకున్నట్లే జరిగింది. ఉదయం రాంబాబు ఇంటికొచ్చిన
పనిమనిషి జరిగింది చూసి వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు ఘటనా స్థలాన్ని
పరిశీలించాక అది దోపిడీ కోసం జరిగిన హత్యగానే భావించారు. పోలీసులు ఫోన్ చేసి
చెప్పగానే రాంబాబు ముంబై నుంచి వెంటనే టాక్సీలో హైదరాబాదుకి తిరిగొచ్చాడు. తను
ఊర్లో లేనందువల్లే ఈ ఘోరం జరిగిందని ముసలి కన్నీళ్లు కారుస్తూ పోలీసులకు
స్టేట్మెంట్ ఇచ్చాడు. హత్య జరిగిన సమయంలో రాంబాబు ప్రయాణంలో ఉన్నట్టు స్పష్టమైన
ఆధారాలు ఉండడంతో పోలీసులు అతన్ని అనుమానించలేదు. రాంబాబు నిశ్చితంగా ఊపిరి
పీల్చుకున్నాడు. కానీ ఒక్క రోజులో అంతా తారుమారైంది. భార్యను హత్య చేసినందుకు
రాంబాబు ను పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పు ఎక్కడ జరిగిందో ఎంత ఆలోచించినా
రాంబాబుకి అంతుపట్టలేదు. చివరకి ఇన్ స్పెక్టర్ విజయ్ ఆ గుట్టు విప్పాడు. "
గతంలో పోలీస్ ఆఫీసర్ వి గనుక ఎంతో తెలివిగా నీ భార్యను చంపి అదే సమయంలో నువ్వు
ట్రైన్లో ప్రయాణిస్తున్నట్లు ఎలిబీ సృష్టించుకున్నావ్. కానీ నువ్వు తప్పు
చేయకపోయినా నువ్వు ఎక్కిన ట్రైను తప్పు చేసింది. సగం దారిలో అతి పట్టాలు తప్పింది.
ఆ సంగతి తెలియక నువ్వు రాత్రంతా ట్రైన్లోనే ప్రయాణించి ఉదయాన్నే ముంబైకి
చేరుకున్నావని స్టేట్మెంట్ చేసావ్. కనీసం ఫోన్ ఆన్ చేసిన తర్వాత అయినా నెట్ లో
చూసి ఉంటే ట్రైన్ ఆగిన సంగతి నీకు తెలిసి ఉండేది. మొత్తంమీద నీ నిర్లక్ష్యమే
నిన్ను చట్టానికి పట్టించింది." అన్నాడు ఇన్ స్పెక్టర్ విజయ్.
ఇన్
స్పెక్టర్ మాటలకు రాంబాబు అసహనంగా జుట్టు పీక్కున్నాడు." వెధవ ట్రైన్లు
ఎప్పుడు ఇంతే... ఈ దేశం ఎప్పుడో బాగుపడుతుందో.." అని కోపంగా గొణుక్కున్నాడు.
కోపం రగిలే వేళ
Reviewed by Smartbyte group
on
August 31, 2018
Rating:

No comments: