బంగారు గొలుసు


"అమ్మా! నాకది కావాలి. ఇవ్వమ్మా!" అమ్మాయి ఒకటే ఏడుస్తుంటే, ఆ ఏడుపువిని పేపర్
చదువుకుంటున్న వీర్రాజు లేచి నిలబడి "ఏమిటి పాప ఎందుకేడుస్తుంది? అని ప్రశ్నించాడు చిరాగ్గా.
"దానికి బంగారు గొలుసు కావాలంట. ఇవ్వలేదని ఏడుపు మొదలెట్టింది" చెప్పింది సరోజ,పాపకి రెండు గట్టిగా తగిలించి. దాంతో అమ్మాయి స్వరం పెంచి ఏడవసాగింది. వీర్రాజు వెంటనే పాపని చేరుకుని సముదాయిస్తూ"పోనీలే ముచ్చటపడు్తోందిగదా, ఇవ్వకూడదూ?" అని భార్యని ఉద్దేశించి అన్నాడు. వీర్రాజు,
సరోజల ఏకైక సంతానం నిఖిత. అయిదో తరగతి చదువుతోంది. ఒక్కర్తే కూతురవడం వల్ల గారాబం ఎక్కువ.అందుకని నిఖిత ఏది కోరినా కాదనకుండా తీరుస్తుంటాడు వీర్రాజు. అతనో ప్రభుత్వోద్యోగి కావడం వల్ల ఆదాయంకి ఢోకాలేకపోవడం వలన ఆర్భాటంగా బతుకుతుంటారు. అందుకని నిఖితకి రకరకాల సందర్భాలలో బంగారు గాజులు, గొలుసు, చెవి రింగులు, బంగారు చెయిన్‌తో వాచీ తయారుచేయించాడు.
           రోజ, భర్త మాటలు విని బీరువా తెరిచి బంగారు గొలుసు తీసి నిఖిత మెడలో వేసి"అసలే బంగారంది. జాగ్రత్తగా ఉండాలి మరి!" చెప్పింది. "ఓ అలాగే" అంటూ నిఖిత ఏడుపు ఆపేసి, నవ్వింది. మూడు రోజుల వరకు నిఖిత గొలుసు జాగ్రత్తగానే తిరిగి తీసుకొచ్చింది. నాలుగోరోజు సాయంత్రం స్కూలు నుండి తిరిగొచ్చిన నిఖిత మెడలో గొలుసు కనిపించలేదు. సరోజ గాభరా పడిపోయింది. "అమ్మో! అది తులం బంగారంతో
చేయించిన గొలుసు. ఇప్పుడు దాని వెల ఇరవై వేల పైచిలుకు ఉంటుంది. ఏంచేశావు గొలుసుని? చెప్పమ్మా?" అని పాపని పట్టుకుని బుజ్జగిస్తూ అడిగింది.
             నిఖిత 'నాకేం తెలియదు మమ్మీ. ఎలా పోయిందో తెలియదు. మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు చూసుకుంటే ఉంది. సాయంత్రం ఆటలాడించారు. ఆ తర్వాత నేనుచూసుకోలేదు" చెప్పింది. సరోజ వెంటనే భర్తకి ఫొన్‌చేసింది. "ఏమండీ! అమ్మయి గొలుసు పోగొట్టింది. స్కూల్లో ఆటలాడిన తర్వాత నుండి కనపడటంలేదనిపిస్తోంది.
అదెక్కడైనా గ్రౌండ్‌లో పడిపోయిందని అనుమానం. మీరు అర్జెంట్‌గా బండిమీద రండి. స్కూల్‌కి వెళ్ళి ప్రినిసిపాల్‌ కంప్లైంట్‌ ఇచ్చి వెతుకుదాం" అని ఏడుస్తూ చెప్పింది.
              వీర్రాజు వెంటనే ఇంటికి వచ్చి భర్యాపాపలతో కలిసి స్కూలుకి వెళ్ళాడు. పదో తరగతికి స్టడీ అవర్స్‌ఉండడం వల్ల ప్రినిసిపాల్‌, స్టాఫ్ ఇంకా స్కూల్లోనే ఉన్నారు. ప్రినిసిపాల్‌ "ఏమైంది సార్‌. ఈ వేళలో వచ్చారు? అని ప్రశ్నించాడు. జరిగిందంతా వివరించింది సరోజ. "అది ఈరోజుల్లో పాతికవేలు చేస్తుంది సార్‌. ఎలాగైనా వెతికించి మాకు గొలుసు వచ్చేలా చేయండి. దొరికిన వాళ్ళకి బహుమతి ఇస్తామని చెప్పండిసార్‌" బతిమలాడింది సరోజ.
               దానికి ప్రినిసిపాల్‌ గారు శాంతంగా "పాపకి అంత విలువైన నగ వేయడం తప్పు కదా. అది పడిపోయింది కాబట్టి సరిపోయింది. అదే ఎవరైనా నగకోసం పాపను గాయపరిచి గొలుసుకాజేస్తే ఏమయ్యేది? మా ప్రయత్నం మేం చేస్తాం. కావాలంటే మీ అమ్మాయి ఎక్కడ ఆడుకుందో అక్కడ వెతికి చూడండి" అన్నారు.
              వీర్రాజు, సరోజ ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. ప్రతిరోజు ప్రినిసిపాల్‌ గారిని కలిసి గొలుసు సంగతి అడిగినా ఫలితం లేకపోయింది. ఒక నెల గడిచింది. ఇక ఆ గొలుసు విషయం మరచిపోదామని నిర్ణయించుకున్నారు.
నిఖిత పెద్దదయ్యేంతవరకూ బంగారు నగలు వేయకూడదని తీర్మానించుకున్నారు. మర్నాడు గొలుసు దొరికినట్లుగాప్రినిసిపాల్‌ గారినుంచి ఫొన్‌వచ్చింది.ఆనందంగా స్కూలుకి వెళ్ళారు వీర్రాజు దంపతులు. గొలుసు చూసి, గుర్తుపట్టి అది తమదేనని ప్రినిసిపాల్‌గారికి కృతజ్ణ్తతలుచెప్పి ఇంటికొచ్చారు.
                తర్వాత లెక్కల మాష్టారు కృష్ణారావు, "సార్‌! ఆ పాప బంగారు గొలుసు అది పోయినరోజే దొరికింది కదా. ఇన్ని రోజుల తర్వాత ఇచ్చారేం" అడిగాడు ప్రినిసిపాల్‌ని. "వెంటనే ఇచ్చేసి ఉంటే వారు మళ్ళీ పాపని నగలతో స్కూలుకి పంపేవారు. ఇలాంటి తప్పు మళ్ళీ చేయకూడదని వారికి తెలిసొచ్చేందుకే వారిని బాధించాను" నవ్వుతూచెప్పారు ప్రినిసిపాల్‌.


బంగారు గొలుసు బంగారు గొలుసు Reviewed by Smartbyte group on July 13, 2016 Rating: 5

No comments: